జగన్ అస్తవ్యస్త పాలనతో ప్రభుత్వ ఖజానా ఖాళీ: నారా లోకేశ్ - ఏపీ పెండింగ్ నిధులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 7:39 PM IST
|Updated : Jan 26, 2024, 8:25 PM IST
Nara Lokesh on Aarogya Sri: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త పాలనతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్‌కు దాదాపు 1200 కోట్ల రూపాయలు నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనే ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారని తెలిపారు. పేదవాళ్ల వైద్యం గాలిలో దీపంలా మారిందని, ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ నిధులను విడుదల చేసి సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపని వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ఆసుపత్రులను డీలిస్ట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య సేవల అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయకులను బలిపశువులుగా మార్చవద్దని హితవు పలికారు. లక్షలాది మంది పేదవారి ప్రాణాలతో కూడుకున్న ఈ అంశంలో ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని, ఇప్పటికైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.