అధికారుల నిర్లక్ష్యంతోనే తుది ఓటర్ల జాబితాలో తప్పులు - రాకెట్లలో ఓటర్ల జాబితా తప్పులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 1:58 PM IST
Mistakes In Final Voter List in Raketla Village: మృతులు, గ్రామంలో లేని వారి ఓట్లను తొలగించాలని క్షేత్రస్థాయి నుంచి బీఎల్ఓలు ప్రతిపాదించినా వాటిని తుది జాబితా నుంచి అధికారులు తొలగించలేదని బూత్ కన్వీనర్ తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో తప్పుల తడకగా ఓటర్ల జాబితా రూపొందించారు. 173వ కేంద్రంలో వరుస సంఖ్య 169, 170, 171, 172లో ఉన్న ఓటర్లు కొన్నేళ్లుగా రాకెట్ల గ్రామంలో నివసించటం లేదు. వీరంతా అనంతపురంలో స్థిరపడి చాలా ఏళ్లు అయినా ఓటరు జాబితాలో వీరి పేర్లు ఉన్నాయి.
రాకెట్ల గ్రామంలో బంధుత్వం లేని వారి పేర్లు తుది ఓటర్ల జాబితాలో ఉన్నాయని బూత్ కన్వీనర్ వెల్లడించారు. ఇరుపార్టీల నేతలు, బీఎల్ఓల సాయంతో జాబితాను క్షుణ్ణంగా పరిశీలించారు. మృతులు, గ్రామంలో లేని వారిని, డబుల్ ఓట్లను తొలగించాలని ఆధారాలతో అధికారులకు ప్రతిపాదించారు. పైస్థాయి అధికారులు సకాలంలో చర్యలు చేపట్టక పోవడంతోనే ఆ ఓటు పునరావృతం అయిందని బూత్ కన్వీనర్ స్పష్టం చేశారు.