ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిత్యావసరాలు విక్రయించాలి : మంత్రి నాదెండ్ల - NADENDLA ON ESSENTIAL PRICES
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2024, 10:23 PM IST
Minister Nadendla on Essential Prices : ధరల స్థిరీకరణ ద్వారా నిత్యావసరాల రేట్లు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని పటమట రైతు బజార్, గురునానక్ కాలనీలోని ఉషోదయ సూపర్ మార్కెట్లో ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పటమట రైతు బజార్లో కూరగాయల రేట్లు, స్టాల్స్‌ను పరిశీలించారు. అలాగే సూపర్ మార్కెట్లో బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు ధరలు ఎక్కువగా ఉండటంపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిత్యావసరాలు విక్రయించాలని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ మేరకు హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల సమావేశంలో కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. సర్కార్ నిర్ణయించిన రేట్లకే విక్రయాలు జరపాలని తెలిపారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం రాయితీతో వినియోగదారులకు ఉల్లిపాయాలు, టమాటాలు, కందిపప్పు, మంచినూనె అందిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యవాసరాల ధరలు అందుబాటులో ఉండే విధంగా అని చర్యలు తీసుకుంటున్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.