బంధుమిత్రుల సమక్షంలో బత్తాయి మొక్కలకు ఘనంగా వివాహం జరిపించిన రైతన్న - ఆ పెళ్లిని మీరూ చూసేయండి - Plants Marriage Viral Video
Published : Jan 21, 2024, 9:31 PM IST
Marriage to Mosambi Plants in Wanaparthy : సాధారణంగా మనుషులకు, జంతువులకు, పక్షులకు, వేప, రావి చెట్టుకు వివాహాలు జరిపిస్తుండటం చూస్తుంటాం. కానీ తోటలో ఉన్న మొక్కలకు వివాహం జరిపించడం మీరు చూశారా? ఇక్కడ ఓ రైతు తాను సాగు చేసిన పంట మొదటిసారిగా కాయల దశకు రావడంతో తోటలో ఉన్న మొక్కలకు ఘనంగా వివాహం జరిపించాడు. వివరాల్లోకి వెళ్తే, వనపర్తి జిల్లా మదనాపురం మండలం దుప్పల్లికి చెందిన రైతు సత్యనారాయణ గౌడ్ దంపతులకు, నెల్విడి శివారులో ఏడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో నాలుగేళ్ల క్రితం బత్తాయి తోటను సాగు చేశాడు.
తోట ప్రస్తుతం కాయల దశలో ఉంది. మొదటిసారి కాపు వచ్చే తోటలో ఉన్న మొక్కలకు వివాహం జరిపిస్తే అధిక ఫలసాయం వస్తుందని ఆయన నమ్మకం. దీంతో పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్ని పాటించి, తోటలో ఉన్న మొక్కలకు వేద పండితులు, వేద మంత్రాలతో రెండు మొక్కలకు బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిపించారు. ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుందని తాతల కాలం నాటి నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాటించినట్లు రైతు వివరించారు. పెళ్లి వేడుకలకు వచ్చిన బంధుమిత్రులకు మంచి విందును సైతం ఏర్పాటు చేశారు.