ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు : టీడీపీ నేత ఎం.ఏ షరీఫ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 10:48 PM IST

M.A Sharif Wrote a Letter to Chief Election Commission of the State : కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత ఎం.ఏ షరీఫ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. కాకినాడ మున్సిపల్  కమీషనర్​గా ఉన్న నాగ నరసింహారావ్, టీ.పీ.ఆర్.ఓ మానె కృష్ణ మోహన్​లపై ఫిర్యాదు చేశారు. ఇదివరకే వీరి వ్యవహార శైలిపై తెలుగు దేశం కాకినాడ సిటీ కో-ఆర్డినేటర్ తుమ్మల రమేష్ జిల్లా ఎన్నికల అధికారులకు తెలిపాడని గుర్తుచేశారు. కాకినాడలోని రాజీవ్ గృహకల్ప జీ+2 భవన పరిసరాలలో అక్రమాలు జరిగాయని తెలిపారు. అక్కడి 83, 91 పోలింగ్ బూతుల్లో నమోదు చేసుకున్న 10 వేల ఓట్లలో ఎవరి ఓటు ఏ పోలింగ్ బూతులో ఉందో అర్ధంకాని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.

 ఒక ఫ్యామిలీకి చెందిన ఓట్లు ఒకే పోలింగ్ బూతులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అనేకమార్లు వినతులు ఇచ్చిన ఏ అధికారి పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లను తారుమారు చేసి ఎక్కడపడితే అక్కడ వేశారని దుయ్యాబట్టారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ఆదేశాలతో నాగనరసింహారావు అధికారపార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఓటర్లను తారుమారు చేయించారని ఆక్షేపించారు. ఓట్లు ఎక్కడున్నాయో కనుక్కోలేక ఓటర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫిబ్రవరి 12 న నాగనరసింహారావు, మానె కృష్ణ మోహన్‌లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఆదేశాలతో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో మీటింగ్ నిర్వహించారని వెల్లడించారు. ఇటువంటి సమావేశాలు జరపకుండా కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రతిపక్షాలపై వివక్ష చూపుతూ అధికారపార్టీకి తొత్తులుగా మారిన వీరిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details