సముద్రంలో గల్లంతై - ప్రాణాలతో బయటపడ్డ యువకుడు - Man Survives Being Lost at Sea - MAN SURVIVES BEING LOST AT SEA
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 20, 2024, 10:42 PM IST
Man Survives Being Lost at Sea: స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి దిగిన యువకుడు అలలు దాటికి గల్లంతు అయ్యాడు. తమతో వచ్చిన తోటి మిత్రుడు అలలదాటికి కొట్టుకుపోయాడని మిత్రులంతా ఆందోళనకు గురయ్యారు. తమ స్నేహితుడు ఇక తిరిగి రాడంటూ ఆందోళన చెందారు. అంతలో అనుకోని సంఘటన జరిగింది. అలల దాటికి అతడు మళ్లీ ఒడ్డుకు కొట్టుకు వచ్చాడు. అతడిని రక్షించిన తోటి స్నేహితులు ప్రభుత్వాసుపత్రికి తరలించిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన దొంగ గౌతమ్, తన మిత్రులతో కలసి కేటరింగ్ చేయడానికి వెళ్లాడు. అక్కడ పని పూర్తవడంతో సరదాగా గడిపేందుకు, స్నేహితులతో కలిసి పేరుపాలెం బీచ్‌కు వచ్చారు. అంతా కలిసి సముద్ర స్నానానికి దిగారు. కొంతసేపటికి సముద్రంలో అలల తాకిడి పెరిగింది. అలల ఉద్ధృతి పెరగడంతో ప్రమాదవశాత్తు గౌతమ్ సముద్రంలోకి కొట్టుకుపోయాడు. తమ కళ్ల ముందే తోటి మిత్రుడు సముద్రంలో కొట్టుకుపోవడాన్ని చూసి మిత్రులు ఆందోళనకు గురయ్యారు. ఇక తమ స్నేహితుడిని ప్రాణాలతో చూస్తామో లేదో అనుకునే లోపే, ఒడ్డు వైపు అలల తాకిడి పెరిగి సముద్రంలో కొట్టుకుపోయిన గౌతమ్ తిరిగి ఒడ్డుకు చేరాడు. స్థానికుల సహకారంతో గౌతమ్‌ను కాపాడిన తోటి మిత్రులు నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.