అల్లూరి విగ్రహవిష్కరణ కోసం పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం-స్పీకర్ అయ్యన్న - AYYANNA PATRUDU
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2024, 7:39 PM IST
Kshatriya Parishad Union Members Met Speaker Ayyanna Patrudu : ఆంగ్లేయులను గడగడలాడించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని ఆయన కృషి అభినందనీయమని క్షత్రియ పరిషత్ యూనియన్ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని సభాపతి అయ్యన్నపాత్రుడుని పరిషత్ సభ్యులంతా ఘనంగా సత్కరించి అభినందించారు. నర్సీపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి సీతారామరాజు పేరు నామకరణం చేయడం పట్ల క్షత్రియ పరిషత్ సభ్యులు అయ్యన్నను అభినందించారు.
వారికి ఇళ్లు కట్టించిన క్షత్రియ పరిషత్ : ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం ముఖ ద్వారంలో సీతారామరాజు విగ్రహం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విగ్రహం ఆవిష్కరణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ని ఆహ్వానిస్తామని అయ్యన్న హామీ ఇచ్చారు. సీతారామరాజు ప్రధాన అనుచరులైన మల్లు దొర సహా 12 మంది వారసుల కుటుంబాలకు క్షత్రియ పరిషత్ ఇళ్లు కట్టించడం చాలా మంచి విషయమని అన్నారు. క్షత్రియ పరిషత్ యూనియన్ సభ్యులను అయ్యన్నపాత్రుడు అభినందించారు.