వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లన్నీ పేదలకు శాపంగా మారాయి: కాలవ శ్రీనివాసులు - Jagananna Colonies in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 2:53 PM IST
Kalava Srinivasulu Inspected Jagananna Colonies: జగనన్న కాలనీలలో వైసీపీ నాయకులు కట్టిన నాసిరకం ఇళ్ల నిర్మాణాలు పేదలకు శాపంగా మారాయని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మల్లాపురం జగనన్న కాలనీలో ఆయన విస్తృతంగా పర్యటించి వైసీపీ నేతలపై వారి అక్రమాలపై విమర్శలు చేశారు. ఇటీవల హేమజ్యోతి అనే మహిళకు 30వ వార్డు కౌన్సిలర్ భర్త గోరంట్ల సత్యనారాయణ కట్టిన ఇల్లు కూలిపోయిన విషయం తెలుసుకుని ఆ ఇంటిని పరిశీలించారు.
నాసిరకం నిర్మాణంతో ఇంట్లో చేరకనే కుప్పకూలిపోయిందని బాధితులు కాలవ శ్రీనివాసులు వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు పిర్యాదు చేస్తానని చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులు నిర్మించిన నాసిరకం ఇళ్ల నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని జైలుకు పంపుతామన్నారు. ఇంకా కొన్ని రోజులే ఈ జగన్ అధికారంలో ఉంటాడని, తరువాత వచ్చేది జనసేన- టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు.