లకౌట్ ఎత్తేయండి-ఉపాధి కల్పించండి! విజయనగరంలో జిందాల్ కార్మికులు ఆందోళన - Jindal Workers Concern
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 18, 2024, 5:30 PM IST
Jindal Industrial Workers Concern in Kothavalasa: తమకు న్యాయం చేయాలంటూ కొత్తవలసలో ఉన్న జిందాల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు విజయనగరంలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పరిశ్రమకు నష్టం వచ్చిందని చెప్పి యాజమాన్యం పరిశ్రమను మూసివేయటం దారుణమని మండిపడ్డారు. పరిశ్రమ మూసి వేతతో తాము రోడ్డున పడ్డామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ తెరిచి తమను విధుల్లోకి తీసుకోవాలని, లేదా లే ఆఫ్ ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. సుమారు 300 మంది కార్మికుల జీవనోపాధిని అధోగతి పాలు చేశారని ఆరోపించారు.
లాకౌట్ ఎత్తేసి తమకు పని కల్పించాలని గత 32 రోజులుగా ఆందోళన చేస్తుంటే యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని కార్మికులు మండిపడ్డారు. 38 సంవత్సరాల నుంచి కార్మికులు పనిచేసి లాభాలు తీసుకొస్తే ఇప్పుడు నష్టం వచ్చిందని ఎటువంటి నోటీసు ఇవ్వకుండా కంపెనీకి తాళాలు వేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ యజమాన్యంతో చర్చించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. తమ సమస్య పరిష్కరించని యెడల ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ నేత కే. సురేష్ హెచ్చిరంచారు.