ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

దులీప్‌ ట్రోఫీ సన్నాహాలు- అనంతపురం చేరుకున్న క్రికెటర్లు - Indian Cricket Team At Anantapur - INDIAN CRICKET TEAM AT ANANTAPUR

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 1:30 PM IST

Indian Cricket Team At Anantapur : దేశవాళీలో అత్యంత ప్రతిష్ఠాత్మక దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ పోటీల సందడి ప్రారంభమైంది. పోటీల్లో పాల్గొనే భారత్‌-సి, డి జట్లు అనంతపురం చేరుకున్నాయి. సూర్యకుమార్‌ యాదవ్‌ మినహా మిగతా ఆటగాళ్లు నగరంలోని హోటల్‌ అలెగ్జాండర్‌కు చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు క్రీడాకారులు ఒక్కొక్కరు వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్నారు. వారికి సంప్రదాయబద్ధంగా హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా క్రికెటర్లు అనంతకు చేరుకున్నారు. ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యే నాలుగు రోజుల పోటీ కోసం  రెండు జట్లు తలపడనున్నాయి.

క్రీడా గ్రామంలో మైదానం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మ్యాచ్‌లు స్థానికులతోపాటు బీసీసీఐ ప్రతినిధులు, వీఐపీలు వీక్షించేందుకు, ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మైదానంలో పిచ్‌ను సిద్ధం చేశారు. డిజిటల్‌ స్కోర్‌ బోర్డు మరమ్మతులు చేసి మ్యాచ్‌ సమయానికి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. మ్యాచ్‌ జరిగే నాలుగు రోజులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.తమ అభిమాన క్రికెటర్లను చూడాలన్న తపనతో యువత భారీ సంఖ్యలో హోటల్ వద్ద బారులు తీరారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అనంతపురం వేదికగా అనంతపురం క్రికెట్ మైదానంలో దులీప్‌ ట్రోఫీ క్రికెట్ వేడుక జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details