పల్నాడు జిల్లాకు జగన్ తీరని అన్యాయం చేశారు: జీవీ ఆంజనేయులు - GV Anjaneyulu fire on CM Jagan - GV ANJANEYULU FIRE ON CM JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 6, 2024, 7:38 PM IST
GV Anjaneyulu Fire on CM Jagan : పల్నాడు జిల్లా ప్రజలకు సీఎం జగన్ తీరని అన్యాయం చేశారని జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. జిల్లా వాసులకు ఇంత అన్యాయం చేసి ఏ ముఖం పెట్టుకొని ఈనెల 8న జిల్లాలో అడుగుపెడుతున్నాడని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గోదావరి, పెన్నా నదుల అనుసంధానం కోసం శంకుస్థాపన చేసి రూ. 6వేల కోట్లు కేటాయించారు. అనంతరం పనులు చకచక జరిగాయి. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం, పల్నాడు ప్రాంత వాసుల సాగు, తాగు నీరు సమస్యను తీర్చే గోదావరి,పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు పనులను నిలిపేసిందని ధ్వజమెత్తారు.
రాజకీయ కుట్రతో ఎక్కిడిపనులు అక్కడే నిలిపివేసి జిల్లావాసులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. అదే నదుల అనుసంధానం జరిగిఉంటే జూన్ మాసంలోనే రైతులు పంటలు పండించేవారని తెలిపారు. అలాగే వరికపూడిశెల ప్రాజెక్టుకు పర్యావరణహిత అనుమతుల కోసం రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఒక రూపాయి కూడా చెల్లించలేదని మండిపడ్డారు. బడ్జెట్లో వరికపూడిశెల ప్రాజెక్టుకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. పల్నాడు వాసుల్ని మోసం చేసిన సీఎం జగన్ క్షమాపణలు చెప్పి ఈ జిల్లాలో అడుగుపెట్టాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.