కాలి బూడిదైన బెంజ్ కారు-ఎందుకో తెలుసా? - Car Caughtfire While Battery Change - CAR CAUGHTFIRE WHILE BATTERY CHANGE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 6, 2024, 7:26 PM IST
Fire Broke Out While Changing the Battery in the Car In Hyderabad : బ్యాటరీ మారుస్తుండగా చెలరేగిన మంటల్లో బెంజ్ కారు దగ్ధమైన ఘటన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని ఫతే మైదాన్ వద్ద చోటుచేసుకుంది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం రాత్రి ఫతే మైదాన్ క్లబ్‌కు కార్తీక్ రెడ్డి అనే వ్యక్తి బెంజ్ కారులో వచ్చారు. తిరిగి వెళుతున్న సమయంలో కారు స్టార్ట్ కాకపోవడంతో దాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయాడు.
ఉదయం కారును స్టార్ట్ చేసేందుకు కొత్త బ్యాటరీ, డ్రైవర్‌ను తీసుకొచ్చారు. కారులో బ్యాటరీ మారుస్తుండగా ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మిగతా కార్లకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుని మంటలను అర్పేశారు. సమయానికి కారులో, పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణాల గురించి ఫైర్ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు.