ఆ ఓటరు పేరు 'దదదద', తండ్రి 'రరకత' - అధికార పార్టీ ఆత్మలకూ ఓటు హక్కు! - errors in chirala voter list
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 12:39 PM IST
Double Entry, Death Votes in Chirala Voter List: పరిశీలించే కొద్దీ ఓటర్ల తుది జాబితాలో చిత్రవిచిత్రాలు కనిపిస్తున్నాయి. బాపట్ల జిల్లా చీరాలలోని ఓ పోలింగ్ కేంద్రంలోనే 35 మంది మృతులకు ఓట్లు ఉండగా, మార్టూరు మండలం ద్రోణాదులలో ఓటరు పేర్లు తికమకగా ఉన్నాయి. అర్ధం కాని అక్షరాలు, కనిపించని మనుషుల పేర్లు, వీటికి తోడు మృతులకు ఓట్లు కల్పించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే ముసాయిదా ఓట్ల జాబితా పరిశీలన తూతూమంత్రంగా సాగిందని చెప్పడానికి ఇదే నిదర్శనం.
ఓటరు పేరు దదదద, తండ్రి పేరు రరకత అని తికమకగా ద్రోణాదుల ఓటర్ల జాబితాలో పేర్లు దర్శనమిచ్చాయి. చీరాల పురపాలక సంఘంలోని బూత్ నంబరు 79లో క్రమ సంఖ్య 136లో షేక్ రఫీ ఏడాది క్రితం మృతి చెందారు. సీరియల్ నంబరు 139లో షేర్ రజాక్ నాలుగేళ్ల క్రితమే మరణించారు. అయినా వీరి ఓట్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఓటరు జాబితా చిత్రంలో ఉన్న వారు తమ గ్రామానికి చెందినవారు కాదని స్థానికులు వెల్లడిస్తున్నారు.