అంగన్వాడీల ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత - జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదు : సీపీఎం - అంగన్వాడీల సమ్మె
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 3:10 PM IST
CPM Srinivasa Rao Visit The Anganwadis in Hospital: సమస్యల పరిష్కారం కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ అనారోగ్యానికి గురైన అంగన్వాడీలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అంగన్వాడీలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పరామర్శించారు. అంగన్వాడీల డిమాండ్లు న్యాయమైనవని తక్షణం వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం చెల్లించడంతో పాటు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.
మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు ప్రాణాలను త్యాగం చేయటానికైనా సిద్ధపడుతుంటే సీఎం జగన్కు మాత్రం ఇవేమీ పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో జగన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంగన్వాడీల చేస్తున్న సమ్మెకు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
40రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించలేదు. అనేక బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నది. అంగన్వాడీల సమస్యలను మాత్రం పరిష్కరించటం లేదు. అంగన్వాడీల ప్రాణాలకు ఎటువంటి హానికలిగినా ప్రభుత్వానిదే బాధ్యత.-వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి