సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారు: కాంగ్రెస్ నేతలు - Peddireddy allegations on Congress
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 7:25 PM IST
Congress Party Meeting in Anantapur: ఏపీలో కాంగ్రెస్ పార్టీ పతనమైందని మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినవారు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఎలా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణికం ఠాగూర్, తులసి రెడ్డి ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఎన్నికల శంఖారావం అనంతపురం జిల్లా నుంచి ప్రారంభిస్తామని రఘువీరారెడ్డి తెలిపారు. 26వ తేదీన ఖర్గే, షర్మిల, మాణిక్యం ఠాగూర్లతో కలసి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని చెప్పారు.
త్వరలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదా మేనిఫెస్టోలో ఉంటాయని స్పష్టం చేశారు. ఇండియా కూటమితో కలిసి వచ్చే అన్ని పార్టీలతోనూ మాట్లాడుతామని రఘువీరారెడ్డి తెలిపారు. 2024 లో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారని మాణికం ఠాగూర్ తెలిపారు. జగన్ ఏపీ ప్రయోజనాలను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని, ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.