అన్నొస్తుండంటే ఇవన్నీ పక్కా ఉండాల్సిందే - ప్రజల గురించి ఆయనకు అవసరమే లేదు - సీఎం జగన్ కుప్పం పర్యటన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 1:54 PM IST
CM Jagan Kuppam Tour: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం ఉంటే చాలు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజలు నానా రకాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు జాతీయ రాహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించడం, ఆర్టీసీ బస్సులను సభలకు తరలింపు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడం వంటివి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ తరహలోనే నేడు సీఎం జగన్ కుప్పం పర్యటనతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.
సీఎం సభకు జనం తరలించేందుకు చిత్తూరు జిల్లా పరిధిలో 800 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. కళాశాలలు, పాఠశాలలకు అనధికారిక సెలవును అధికారులు ప్రకటించారు. విద్యాసంస్థల బస్సులను జన సమీకరణ కోసం వైఎస్సార్సీపీ నేతలు వినియోగిస్తున్నారు. గుండుశెట్టిపల్లె సమీపంలో జాతీయ రహదారి పక్కన బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. పలమనేరు- కృష్ణగిరి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అర్టీసీ బస్సుల తరలింపుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వేళకు గమ్యస్థానాలకు చేరుకోలేక సతమతమవుతున్నారు.