ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 9:46 PM IST

ETV Bharat / videos

మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు ఎన్నడూ విజయవంతం కాలేదు: సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ

Citizens for Democracy Organization on Attacks on Media: రాష్ట్రంలో పాత్రికేయులపై , మీడియా సంస్థలపై జరుగుతున్న తీవ్రతరమైన వరుసదాడుల పట్ల సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ తీవ్ర ఆందోళనను, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ తరహా దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ మేరకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఛైర్మన్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి భవానీ ప్రసాద్, సంస్థ ఉపాధ్యక్షుడు ఎల్.వి సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. పాత్రికేయులపై ఉద్దేశపూర్వక దాడులు, మీడియా సంస్థల కార్యాలయాల విధ్వంసం వంటి చర్యలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ముమ్మాటికీ విరుద్ధమేనన్నారు. 

రాజ్యాంగ వ్యవస్థలోనాలుగో స్థంభమైన మీడియా ప్రజలకు వాస్తవాలను నిజాయితీగా నివేదించే కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నందున మీడియా స్వేచ్ఛను అణచివేయడానికి జరిగే ప్రయత్నాలు సరికాదని ఖండించారు. మీడియా స్వేచ్ఛను హరించడానికి జరిగిన ప్రయత్నాలు చరిత్రలో ఎన్నడూ విజయవంతం కాలేదని, ఇకపైనా కాబోవని పేర్కొన్నారు. దాడులకు పాల్పడ్డ దుండగులు ఏ రాజకీయ పార్టీలకు చెందినవారైనా వెంటనే అరెస్టు చేయాలని, చేసిన దురాగతాలకు తగిన మూల్యం చెల్లించేటట్లు గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. నిష్పాక్షిక స్వేచ్ఛాయుత ఎన్నికలకు దేశం సిద్ధం అవుతున్న ప్రస్తుత కీలకమైన తరుణంలో చట్టబద్ధ పాలనకు భంగం కలిగించే ఎలాంటి చర్యలను అనుమతించరాదన్నారు. మీడియా స్వేచ్ఛకు అండగా పౌరసమాజం నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details