బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు - కీలక పత్రాలు స్వాధీనం - CID Searches Vasudeva Reddy Home - CID SEARCHES VASUDEVA REDDY HOME
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 22, 2024, 10:32 AM IST
CID Searches Beverages Former MD Vasudeva Reddy Residence: జగన్ ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు సూత్రదారులుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ ఉచ్చు బిగిస్తోంది. గుంటూరు జిల్లా కుంచపల్లిలోని ఆయన విల్లాలో శుక్రవారం ఉదయం నుంచి సీఐడీ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. శుక్రవారం రాత్రి వరకూ తనిఖీలు కొనసాగాయి. హైదరాబాద్ నానకరాంగూడలో వాసుదేవరెడ్డి నివసించే విల్లాలోనూ సీఐడీ బృందాలు ఇప్పటికే తనిఖీలు నిర్వహించాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే వాసుదేవరెడ్డి తన విల్లాకు తాళాలు వేసేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ తాళాలు పగులగొట్టి సోదాలు నిర్వహించేందుకు న్యాయస్థానం నుంచి సీఐడీ అధికారులు అనుమతి పొందారు. అయితే ఆ తర్వాత వేరే తాళాలు దొరకడంతో విల్లా తలుపులు తెరిచి తనిఖీలు చేపట్టారు. ఏపీఎస్‌బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి చోరీ చేశారన్న ఫిర్యాదుపై ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో ఈ నెల 6వ తేదీన కేసు నమోదైంది. అందులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి.