నరసాపురంలో జారిపడిన ఏటిగట్టును పరిశీలించిన ఇంజినీర్లు - 26 కోట్లతో నిర్మాణ పనులు - Godavari
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 7:38 PM IST
Chief Engineers Inspected Godavari Riverbund Works: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్మాణంలో ఉండగా జారిపడ్డ ఏటిగట్టు పనులను గోదావరి డెల్టా సెక్షన్ చీఫ్ ఇంజినీర్‌తోపాటు పలు విభాగాల ఇంజినీర్లు పరిశీలించారు. గతంలో వచ్చిన వరదల ప్రభావంతో ఈ ప్రాంతంలో గోదావరి గట్టు కోతకు గురైందన్నారు. ఆ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం 56 లక్షల రూపాయలు కేటాయించగా మరమ్మతులు పూర్తి చేశామన్నారు.
శాశ్వత పరిష్కారంగా గట్టు పటిష్ఠ చర్యలు చేపట్టేందుకు 26 కోట్ల 38 లక్షల రూపాయలతో గోదావరి ఏటిగట్టు పనులు చేపట్టామని గోదావరి డెల్టా సెక్షన్ చీఫ్ ఇంజినీర్ సతీష్‌కుమార్ తెలిపారు. 2012 డిజైన్ ప్రకారం నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. గట్టు జారిపోతున్న ప్రాంతంలో పటిష్టంగా నిర్మించేందుకు నిపుణుల సలహాలు తీసుకొంటామన్నారు. ఏటిగట్టు దిగబడిన ప్రాంతం ప్రమాదకరమని 2020లో ఐఎస్ఎన్ రాజు కమిటీ ప్రభుత్వానికి నివేదించిందని తెలిపారు. మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత పూర్తి నివేదిక సమర్పిస్తామన్నారు. నివేదిక ఆధారంగా పనులు పూర్తిచేస్తామన్నారు..