అయోధ్యలో చంద్రబాబు - రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు - TDP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 2:03 PM IST
|Updated : Jan 22, 2024, 8:49 AM IST
Chandrababu Naidu in Ayodhya: రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయోధ్యకు చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అయోధ్యకు బయల్దేరారు. నేడు అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు చంద్రబాబును ఆహ్వానించారు. చంద్రబాబుతో కలిసి ఎంపీ రామ్మోహన్ నాయుడు అయోధ్యకు వెళ్లారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు అయోధ్యకు బయల్దేరారు. రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం అయోధ్య నుంచి తిరిగివస్తారు.
ఇతరు ప్రముఖులు సైతం: జనసేన అధినేత పవన్ కల్యాణ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సైతం అయోధ్య చేరుకున్నారు. జస్టిస్ ఎన్.వి.రమణ, శివమాల దంపతులకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఆహ్వానాలు అందుకున్న వివిధ రంగాల ప్రముఖులు ఆదివారం నుంచే అయోధ్యకు పయనమయ్యారు.
ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఇప్పటికే దేశంలో వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులు సుమారు 8 వేల మంది పేర్లతో జాబితాను సిద్ధం చేసింది. అందులో 506 మందిని అత్యంత ప్రముఖులుగా ఎంపిక చేశారు. మరోవైపు, సోమవారం కన్నులపండువగా జరిగే అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. అందమైన పువ్వులు, ప్రత్యేక దీపాలతో అలకరించారు.