మంచి నాయకుడే సమాజానికి మంచి భవిష్యత్ ఇస్తాడు: బోయపాటి శ్రీను - boyapati at guntur
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 7:55 PM IST
Boyapati Speech at RVRJC College Function : ఓ మంచి నాయకుడు సమాజానికి మంచి భవిష్యత్తును ఇస్తారని ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ (RVR & JC) ఇంజినీరింగ్ కళాశాలలో కొలరిడో ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ, విద్యార్థులు చదువులతో పాటు సమాజం పట్ల కూడా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యార్థుల ముందు కృత్తిమ మేధ రూపంలో అతిపెద్ద సవాల్ ఉందని తెలిపారు. దాన్ని ఎదుర్కొనేలా అందరూ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.
అదేవిధంగా ప్రతి ఒక్కరు బాధ్యతతో పోలింగ్ బూతు వద్దకు వెళ్లి ఓటు వెయ్యాలని తెలిపారు. అప్పడే ఈ సమాజం బాగుపడుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో వివిధ రకాల వినోద కార్యక్రమాలతో పాటు సాంకేతిక ప్రదర్శనలు, క్రీడాపోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో బోయపాటితో పాటు కళాశాల ఛైర్మన్ రాయపాటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.