బోగస్ ఓట్లపై అధికారుల నిర్లక్ష్యం: తుది ఓటరు జాబితాలో అవే తప్పులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 1:43 PM IST
Bogus Votes in Anantapur Final Voter List: ఒక ఇంటి నంబరు పరిధిలో పదికి లోపు ఓట్లు ఉండవచ్చన్న అవకాశాన్ని అందిపుచ్చుకుని అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇష్టం వచ్చినట్లు బోగస్ ఓట్లు నమోదు చేశారు. మరో 20 మందికి పైగా స్థానికేతరులకు ఓట్లు కల్పించారు. వీటిని ఇంటింట ఓటరు జాబితా పరిశీలనలో డబుల్, స్థానికేతర ఓట్లు ఉన్నాయనని బీఎల్ఏ (Booth Level Agent)లు గుర్తించారు. వీటి గురించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదుదారుల అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా తుది జాబితాను మళ్లీ అవే తప్పులతో ముద్రించారని స్థానిక ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ తుది ఓటర్ల జాబితా తప్పులతడకగా దర్శనమిస్తోంది. ఉరవకొండ పొలింగ్ కేంద్రం 131లో డబుల్(Double Entry Votes), స్థానికేతర ఓట్లు(Non-local votes) 20కి పైగా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అలాగే ఒకే ఇంటి నంబరుతో ఎక్కువ మందికి ఓట్లు కల్పించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోగస్ ఓట్లపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా తప్పుడు ఓట్లతో తుది ఓటర్ల జాబితా రూపోందించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.