మోసపూరిత జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు జనం సిద్ధం : యామిని శర్మ - Allegations on CM Jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 1:07 PM IST
BJP Yamini Sharma Allegations on CM Jagan: నమ్మకద్రోహానికి, విశ్వాస ఘాతుకానికి వైసీపీ పార్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాలన నియంతృత్వానికి పరాకాష్టగా నిలిచిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీశర్మ ఆరోపించారు. తాము ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చామంటూ సీఎం ప్రకటిస్తున్నారని కానీ, నవరత్నాల్లోనూ ప్రజలకు గుండు సున్నా చుట్టారని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం హామీని మనీరత్నంగా మార్చుకున్నారని విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ఇసుక ధరలను పెంచి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని, సహజ వనరులు, భూములు, కొండలు ఇలా అన్నింటినీ కొల్లగొడుతున్నారని అన్నారు. పన్నుల మోతతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ప్రశ్నించినా, గొంతు వినిపించినా అక్రమ కేసులతో సామాన్యులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రజలంతా జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని అదే రాష్ట్రంలోని రాజకీయ వాతావరణంగా కనిపిస్తోందన్నారు.