దేశాన్నే కుదిపేసిన ఘటన విశాఖలో జరిగింది: సాధినేని యామిని - SADINENI YAMINI ON VISAKHA DRUGS - SADINENI YAMINI ON VISAKHA DRUGS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 2:40 PM IST
BJP Yamini Comments on Visakha Drugs Incident: విశాఖలో 25వేల కిలోల డ్రగ్స్ పట్టివేత ఘటన దేశాన్ని కుదిపేసిందని భారతీయ జనతా పార్టీ నాయకురాలు సాధినేని యామిని శ్రీ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు, నార్కోటిక్స్ విభాగం డ్రగ్స్ సరఫరాను అరికట్టకుండా నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని, మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. వీటి వల్లే మహిళలపై నేరాలు, దాడులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు.
డ్రగ్స్ పట్టుబడిన కంటైనర్ వైకాపా నేత కూనం వీరభద్రరావు కంపెనీదని ఆధారాలతో నిరూపిస్తున్నా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. కూనం వీరభద్రరావుకు చెందిన సంస్థ సంధ్య ఆక్వా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో విశాఖకు కంటైనర్ వచ్చిందని యామిని అన్నారు. ఆయనకు వైసీపీతో సంబంధాలున్నాయని ఆరోపించారు. అతడి సోదరుడు కూడా ఆ పార్టీ నాయకుడేనని చెప్పారు. ఇదంతా కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోతామని తెలిసినా అధికార పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పురందేశ్వరిపై అసత్య ఆరోపణలు మానుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.