దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు వద్దు - ఈసీకి పురందేశ్వరి లేఖ - PURANDESWARI LETTER TO EC - PURANDESWARI LETTER TO EC
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 9:46 AM IST
BJP State President Purandeswari Letter to EC: రాష్ట్ర దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులను అప్పగించవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వీరితో పాటు దేవాదాయశాఖ కమిషనర్‌కు కూడా లేఖ పంపారు. ఎన్నికల్లో దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లు, కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈసీ ప్రధానాధికారికి సూచించినట్లు తెలిసిందని ఆమె లేఖలో ప్రస్తావించారు. గతంలో ఎన్నడూ దేవాదాయశాఖ సిబ్బందిని ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోలేదని పురందేశ్వరి తెలిపారు. దేవాదాయ శాఖ సిబ్బందిలో ఎక్కువ మంది హిందూ మతానికి చెందినవారేనని ఆమె పేర్కొన్నారు. వారిని ఎన్నికల విధుల్లో నియమిస్తే ఒక మతానికి చెందిన వారి సేవలను మాత్రమే వినియోగించుకుంటున్నారనే నిరాధార ఆరోపణలు వస్తాయని తెలిపారు.
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో శ్రీరామనవమి, నృసింహ జయంతి, బ్రహ్మోత్సవాలు, గ్రామ దేవతల వార్షిక వేడుకలు ఉన్నాయని వీటి నిర్వహణలో దేవాదాయశాఖ ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆలయాలకు భక్తుల తాకిడి సాధారణ రోజుల కంటే ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈ సమయంలో ఆలయాల్లో దేవాదాయశాఖ ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించడానికి వేలాది మంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని ఆ సంఖ్యతో పోలిస్తే దేవాదాయ శాఖ సిబ్బంది సంఖ్య చాలా తక్కువని దీనిపై తగిన ఆదేశాలు జారీ చేయాలని పురందేశ్వరి లేఖలో కోరారు.