అభ్యర్ధుల ఎంపికలోనూ జగన్ రివర్స్- ప్రజలకు మంచి చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు: సత్యకుమార్ - వైఎస్సార్సీపీ అభ్యర్థుల మార్పు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 2, 2024, 7:52 PM IST
BJP Leader SatyaKumar Satires on YSRCP : 'తిక్కోడు తిరునాళ్లకు పోతే ఎక్కాదిగా సరిపోయిందంట' సరిగ్గా అలా ఉంది సీఎం జగన్ వ్యవహారం ఉందంటూ బీజేపీ నేత సత్యకుమార్ ఎద్దేవా చేశారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో రివర్స్ పాలన సాగించిన జగన్ ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలోనూ అదే విధానాన్ని ఎంచుకున్నాడని ఆయన అన్నారు. ఇప్పటికే 9 జాబితాలను విడుదల చేసిన వైఎస్సార్సీపీ అధిష్టానం, వదిలిన జాబితాల్లోని వారి స్థానాలు మళ్లీ మళ్లీ ఎందుకు మారుస్తువస్తున్నారు సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థుల మార్పు నాటకాల్లో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడ్ని తలపిస్తోందని ట్విటర్ (X) వేదికగా ఆయన ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మంచి చేసి ఉంటే అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ మేలు చేశామని, తనకు తాను దైవాంశ సంభూతిడిగా అభివర్ణించుకునే జగన్, ఎవరిని అభ్యర్థిగా పెట్టినా గెలవాలి కదా అని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. తప్పుల్ని, చేతగానితనాన్ని అభ్యర్థులపై నెట్టి, వాళ్ల ఓటమికి బాధ్యత లేదని చెప్పి తప్పించుకోవడం జగన్నాటక ప్రయత్నం కాదా అని ఆయన నిలదీశారు.