ధర్మవరం అభ్యర్థి విషయంలో బీజేపీ అధిష్ఠానం మరొసారి పునరాలోచించుకోవాలి : గోనుగుంట్ల - Goguntla Suryanarayana - GOGUNTLA SURYANARAYANA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 12:17 PM IST
BJP Leader Goguntla Suryanarayana Meeting in Satya Sai District : ధర్మవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి పేరును మరొసారి పునరాలోచించుకోవాలని బీజేపీ అధిష్ఠానాన్ని కోరినట్లు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆయన బీజేపీ కార్యకర్తలతో ఆదివారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. పొత్తులో భాగంగా ధర్మవరం స్థానం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు కేటాయించారని స్థానికుడైన తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి అరాచకాలు అడ్డుకొని కార్యకర్తలను కాపాడుకున్న తనకు అన్యాయం చేయొద్దని అన్నారు. ధర్మవరం నియోజక వర్గ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యే అభిమానులు ఈ ఆత్మీయ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేశారు.
ధర్మవరం నియోజక వర్గ పరిస్థితులను బీజేపీ అధిష్ఠానానికి వివరించానని ఈ సందర్భంగా సూర్యనారాయణ తెలియజేశారు. అధిష్ఠానం నిర్ణయం సానుకూలంగా ఉండే అవకాశం ఉందన్నారు. ధర్మవరంలో ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అభీష్టం మేరకు ఎన్నికల బరిలో ఉంటానన్నారు. ప్రాణం ఉన్నంత వరకూ అధికారం ఉన్నా లేకున్నా ధర్మవరం ప్రజలకు అండగా నిలుస్తానని సృష్టం చేశారు.