అటవీ సిబ్బందిపై ఎలుగుబంట్లు దాడి - చెదరగొట్టిన సహోద్యోగులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 25, 2024, 5:57 PM IST
Bear Attack on Forest Staff in Nellore District : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో డ్యూటీలో ఉన్న బేస్ క్యాంప్ సిబ్బందిపై రెండు ఎలుగుబంట్లు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అటవీ శాఖ సిబ్బంది కర్రలు, రాళ్లతో తిరగబడ్డారు. దీంతో రెండు ఎలుగుబంట్లు అడవిలోకి పారిపోయాయి. కాగా వారికి గాయాలయ్యాయి.
ఎలుగుబంటి దాడిలో అటవీ శాఖకు చెందిన రోశయ్యకు తీవ్ర గాయాలు కావడం వల్ల స్థానిక సిబ్బంది హుటాహుటిన మర్రిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యాధికారులు అతన్ని పరిశీలించి గాయమైన చోట రక్తం పోకుండా కట్టు కట్టడంతో పరిస్థితి కుదుటపడింది. ఆరు నెలల క్రితమే హైవేపై వెళ్తున్న కారుపై అమాంతం పెద్దపులి దాడి చేసిన ఘటన మరువక ముందే మళ్లీ ఈ ఎలుగుబంట్ల దాడి జరగడం వల్ల స్థానిక గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.