చెప్పినట్లే 15 వేల చీరలు పంపిణీ- గతంలో మాదిరే కరెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం: బాలినేని - Sarees Distribution to voters
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 2, 2024, 4:23 PM IST
Balineni Srinivasa Reddy Sarees Distribution: వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో మహిళలకు ఎన్నికల తాయిలాలను వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆసరా నాలుగో విడత రుణమాఫీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెక్కులను బాలినేని అందజేశారు. అనంతరం అక్కడకి వచ్చిన కొంత మంది మహిళలకు సభపై చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మిగతా మహిళలకు ఇంటింటికీ చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు. గతంలో చెప్పిన విధంగానే 15 వేల మందికి చీరలు పంపిణీ చేశామని ఆయన అన్నారు. అదే విధంగా వైఎస్సార్ ఆసరా ఇంకా కొంత మంది మహిళలకు పడలేదని, వారికి కూడా రెండు రోజుల్లో పడతాయని, దీనికి కారణం చేయూత పథకం ఉండటంవల్ల డబ్బులు అడ్జస్ట్ చేయడంలో లేట్ అవుతుందని బాలినేని తెలిపారు. పంట పొలాలకు సరిగ్గా కరెంటు అందడం లేదని రైతులు ప్రశ్నించగా గతంలో ఇచ్చిన విధంగానే ఉదయం నాలుగు గంటల నుంచి కరెంటు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.