ఇన్పుట్ సబ్సిడీ, విద్యా కానుక పథకం నిధుల విడుదలపై హైకోర్టులో వాదనలు - high court orders on Input Subsidy
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 9:33 PM IST
AP High Court Orders on Input Subsidy Petition : ఇన్పుట్ సబ్సిడీ, విద్యా కానుక పథకం నిధుల పంపిణీని నిలిపివేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై అత్యవసరంగా దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇవ్వన్నీ గతంలో ప్రారంభించిన పథకాలేనని పిటీషనర్ తరుపు న్యాయవాది వాదించగా ప్రభుత్వం వినతి ఇస్తే పునః పరిశీలన చేస్తామని ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరుపున వినతిని ఈరోజే ఇస్తామని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను గురవారంకి వాయిదా వేసింది.
అయితే 2023 ఖరీఫ్ సీజన్లో కరవు కారణంగా 6,95,897 లక్షల మంది రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలిచ్చింది. సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన స్క్రీనింగ్ కమిటీలో ఈ అంశంపై చర్చించి ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించేందుకు ఎన్నికల సంఘం ఆమోదం కోసం పంపింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ రూ. 847 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ నిధుల పంపిణీనీ నిలుపుదల చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.640 కోట్ల విద్యా దీవెన పథకం నిధుల విడుదలని కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకూ విడుదల చేయరాదని ఈసీ ప్రభుత్వన్ని ఆదేశించింది.