ఉద్వేగానికి గురైన రాజధాని రైతులు- అమరావతికి మహర్దశ అంటు ఆనందోత్సవాలు - Amaravati Farmers Celebrations - AMARAVATI FARMERS CELEBRATIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 12, 2024, 3:52 PM IST
Amaravati Farmers Celebrations: ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగానే రాజధాని రైతులు సంబరాలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని తుళ్లూరు దీక్షా శిబిరంలో భారీ ఎల్సీడీ తెరపై వీక్షించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు అనగానే రైతుల ఒక్కసారిగా ఇక్కడ దీక్షా శిబిరంలో ఏర్పాటు చేసిన తెరపై గులాబీ పూలు చల్లారు. పసుపు రంగు బెలూన్లు పట్టుకొని జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రైతులు తాము సంతోషంగా గడిపి ఐదు సంవత్సరాలు అయిందని తెలిపారు. గత ఐదేళ్లుగా ఉద్యమంలో ఉండటంతో పండగలన్నీ రోడ్లపైనే నిర్వహించుకోవాల్సి వచ్చిందన్నారు. ఏపీ చరిత్రలో ఇవాళ సువర్ణ అధ్యాయమని.. అరాచక, అన్యాయంపై విజయానికి గుర్తుగా సంబరాలు చేసుకునే రోజు అని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారంతో తమ బాధలన్నీ తీరిపోయాయని రైతులు వెల్లడించారు. ఇకనుంచి ప్రజా రాజధాని అమరావతికి మహర్దశ వస్తుందని, అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.