భార్యను కాపురానికి పంపడం లేదని మామపై అల్లుడు యాసిడ్ దాడి - Acid attack on Person
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 7:15 AM IST
|Updated : Apr 2, 2024, 10:54 PM IST
Acid Attack in Eluru District: భార్యను కాపురానికి పంపేందుకు ఆమె తండ్రి నిరాకరిస్తున్నాడనే అక్కసుతో ఎలాగైనా మామ అడ్డు తొలగించాలనుకున్నాడు ఓ అల్లుడు. పథకం ప్రకారం ఇంట్లో నిద్రిస్తున్న మామపై యాసిడ్ పోసి హతమార్చాడు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు (60) పెద్ద కూతరు కృష్ణవేణిని టి. నర్సాపురం మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన రంగిశెట్టి రమేశ్‌తో 30 ఏళ్ల క్రితం వివాహమైంది.
అయితే చెడు వ్యసనాలకు బానిసైన రమేశ్, భార్య కృష్ణవేణిని తరచూ వేధింపులకు గురి చేయడంతో ఏడాది క్రితం ఆమె పుట్టింటికి వచ్చేసింది. భార్యను ఎన్నిసార్లు కాపురానికి రావాలనిన పిలిచినా నిరాకరించడంతో ఆమె తండ్రి నాగేశ్వరరావు అడ్డు తగులుతున్నాడని అతడిపై రమేశ్ కక్ష పెంచుకున్నాడు. దీంతో ఈ నెల 31న లక్కవరంలోని మామ ఇంటికి వచ్చిన రమేశ్ తనతో సీసాలో తెచ్చుకున్న యాసిడ్‌ను నిద్రిస్తున్న మామ నాగేశ్వరరావుపై పోసి అక్కడ నుంచి పరారయ్యాడు.
వెంటనే కుటుంబసభ్యులు నాగేశ్వరరావును జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రి, అక్కడ నుంచి ఏలూరు తరలించారు. చివరకి సోమవారం చికిత్స పొందుతూ నాగేశ్వరరావు మరణించాడు. దీంతో సీఐ రాజేశ్ ఆధ్వర్యంలో ఎస్సై సుధీర్, తడికలపూడి ఎస్సై జయబాబులు ప్రత్యేక టీం లుగా ఏర్పడి నిందితుడు రమేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి మంగళవారం పుటగట్లగూడెం గ్రామంలోని నీలాలమ్మ గుడివద్ద నిందితుడు రమేశ్‌ను అరెస్టు చేశామని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు.