అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి- నష్టపరిహారం చెల్లించాలని బంధువుల డిమాండ్ - చెట్టు కూలి శ్రీనివాసరావు మృతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 5:16 PM IST
Man died after falling on a broken tree : ప్రమాదకరంగా ఉన్న వృక్షాన్ని తొలగించకపోవడం వల్లే శ్రీనివాసరావు మరణించాడని విజయనగరం జిల్లా రాజాంలో మృతుని బంధువులు ధర్నాకు దిగారు. మున్సిపల్ కార్యాలయం వద్ద అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. గత జనవరి చివరి వారంలో ఆకతాయిలు చెట్టుకు నిప్పు పెట్టడంతో మెుదలు చాలా వరకూ కాలిపోయింది. అప్పటి నుంచి వృక్షాన్ని తొలగించాలని స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కానీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో వృక్షం ఒకసారిగా కూలిపోయి శ్రీనివాసులు మృతి చెందిరని బంధువులు పేర్కొన్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే శ్రీనివాసరావు మరణించాడని ఆరోపించారు.
ఆదివారం(మార్చి 3న) శ్రీనివాసరావు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు చెట్టు విరిగిపడి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు స్పందించి శ్రీనివాసరావుని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. దీంతో శ్రీనివాసరావు మృతికి మున్సిపల్ అధికారులే కారణమంటూ అతని బంధువులు ధర్నాకు దిగారు. శ్రీనివాసరావు మృతికి మున్సిపల్ అధికారులు బాధ్యత వహించి, నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.