Driverless Car: వాహన తయారీ దిగ్గజం టెస్లా మానువుల ఊహాలను సృజనాత్మకతతో నిజం చేశారు. ఆ కంపెనీ CEO ఎలాన్‌మస్క్ రోబోవ్యాన్, రోబోకార్లను ప్రపంచానికి పరిచయం చేశారు. అమెరికా కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో రోబో నడిపే వివిధ రకాల కార్లను ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చారు. మస్క్ ప్రదర్శించిన రోబోవ్యాన్ సాధారణ డిజైన్లకు
విభిన్నంగా ఉంది. రైలు ఇంజిన్ వంటి డిజైన్‌లో రోబో వ్యాన్‌ను రూపొందించారు. రోబో వ్యాన్ చక్రాలు కనిపించకపోవడం దీని విశిష్ఠతగా చెప్పుకొచ్చారు. ఈ రోబో వ్యాన్‌లో 20 మంది ప్రయాణికులు లేదా అంతే బరువు గల సరకులను సులువుగా తరలించవచ్చని టెస్లా పేర్కొంది.
ఎలాన్‌మస్క్ చెప్పిన విశేషాలు
- మూడు విభాగాల్లో ఈ రోబో కార్లు ఉంటాయి
- మొదటిది రోబో ట్యాక్సీ
- రెండోది హ్యాచ్ బ్యాక్ కేవలం రెండు సీట్లు మాత్రమే
- మూడో విభాగంలో కార్గో వాహనం
- కార్గోలో 20మంది లేదా సమాన బరువు వస్తువుల రవాణా చేయవచ్చు
- ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం
- వైర్‌లెస్ ఛార్జింగ్ దీని ప్రత్యేకత
- డ్రైవర్ లేని కారు
- స్టీరింగ్, పెడల్స్ ఉండవు
- 2026-27 సంవత్సరంలో బుకింగ్స్
- రోబోటాక్సీ (అకా సైబర్‌క్యాబ్) ధర 30 వేల డాలర్లు
రోబో వ్యాను నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువే. ఒకటిన్నర కిలోమీటర్ల ప్రయాణానికి భారత కరెన్సీలో కేవలం 11రూపాయల ఖర్చు అవుతుంది. ఈ కారును నడపడానికి డ్రైవర్లు అవసరం లేదు. కేవలం అటానమస్ సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్‌తో దీన్ని నిర్మించినట్లు టెస్లా కంపెనీ వివరించింది. ఒకే కారులో 20మంది ప్రయాణించగల వాహనాన్ని రూపొందించి , టెస్లా సామూహిక ప్రయాణ వాహన తయారీ విభాగంలోకి కూడా ప్రవేశించినట్లైంది. ఇప్పటివరకు టెస్లా సంస్థ వాహనాలు కేవలం చిన్నవాటికే పరిమితమైంది.
ఇక రోబో ట్యాక్సీని కూడా ఎలాన్ మస్క్ ఈ ప్రదర్శనలో ఆవిష్కరించారు. రెండు డోర్లతో ఉన్న ఈ కారుకు స్టీరింగ్ వీల్, పెడల్స్ లేవు. దీన్ని సైబర్ క్యాబ్ అని ప్రేక్షకులకు మస్క్ పరిచయం చేశారు. ఈ రోబో ట్యాక్సీ తయారీ 2026 నుంచి ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులకు కేవలం 30,000 డాలర్ల కంటే తక్కువకే విక్రయించేలా టెస్లా ప్రణాళికలు రూపొందించింది. అటానమస్ కార్లను సాధారణ వాహనాల కంటే 5 నుంచి 10 రెట్లు అదనంగా వాడొచ్చని మస్క్ వెల్లడించారు.