Google New Quantum Chip:టెక్నాలజీ దిగ్గజం గూగుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గొప్ప ప్రగతిని సాధించింది. సరికొత్త క్వాంటమ్ చిప్‌ను ఆవిష్కరించింది. 'విల్లో' క్వాంటమ్ పేరుతో తీసుకొచ్చిన ఈ చిప్.. సాధారణ కంప్యూటర్లతో పోల్చితే మెరుపు వేగంతో పనిచేస్తుంది. ఈ మేరకు ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా అసలేంటీ క్వాంటమ్ చిప్? దీన్ని ఎక్కడ అభివృద్ధి చేశారు? వంటి వివరాలు మీకోసం.
ఏంటీ క్వాంటమ్ చిప్?:క్వాంటమ్ చిప్ అనేది ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ చిప్. ఇది క్వాంటమ్ మెకానిస్ సూత్రాలను అనుసరించి పనిచేస్తుంది. ఇది సాధారణ చిప్‌నకు కాస్త భిన్నంగా ఉంటుంది. దీనిలోని ప్రత్యేక సామర్థ్యంతో సాధారణ కంప్యూటర్ల కంటే చాలా వేగంగా సంక్లిష్ట గణనలను పూర్తిచేస్తుంది.
సాధారణ కంప్యూటర్లు బైనరీ భాష మీద ఆధారపడి పనిచేస్తాయి. అంటే ఇవి 0, 1 అనే రెండు సంకేతాలతో పనిచేస్తాయి. ఇందులో 0 అంటే విద్యుత్ (ఎలక్ట్రాన్ల) ప్రవాహం లేకపోవడం, 1 అంటే విద్యుత్ ప్రసారం ఉండటం. 0, 1ని కలిపి 'బిట్' అని పిలుస్తారు. ఈ యుగళ కోడ్‌లో 1 అనే అంకె రాయడానికి '001' అని రాయాల్సి ఉంటుంది. 2 అనే అంకె రాయాలంటే '0011' అని రాయాలి.
కంప్యూటర్‌లోని ట్రాన్సిస్టర్లు ఆగిపోతే 0 అని, ఆన్ అయితే 1 అని సంకేతం వస్తుంది. ప్రస్తుత కంప్యూటర్లు ఈ బైనరీ కోడ్‌లోనే సమాచారాన్ని నిల్వచేసి, ప్రాసెస్ చేస్తున్నాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్స్‌ను ఉపయోగిస్తాయి. క్యూబిట్ ఒకేసమయంలో 0గా, 1గా ఉంటుంది. అంటే ఏకకాలంలో ఆన్, ఆఫ్ స్థితిలో ఉండగలదు. దీన్ని సూపర్ పొజిషన్గా పిలుస్తారు.
క్వాంటమ్ కంప్యూటర్ ఈ సూపర్ పొజిషన్ సాయంతో అపార సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేస్తుంది. ఇది భవిష్యత్తులో పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. క్యూబిట్స్ వల్లే సాధారణ కంప్యూటర్ల కంటే వేగంగా ఇవి గణనలను పూర్తి చేయగలుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక గూగుల్ తన కొత్త 'విల్లో' క్వాంటమ్ చిప్‌లో 105 క్యూబిట్స్‌ను పొందుపరిచింది.