YSRCP Took Loans TIDCO Beneficiaries Facing Problems in Krishna District :కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణ పరిధిలోని జెమిని స్కూల్, ఎగినపాడు, గండిగుంటలో గత తెలుగుదేశం ప్రభుత్వం 2 వేల 500కు పైగా టిడ్కో గృహాలు మంజూరు చేసింది. ఉయ్యూరులోని తొమ్మిది బ్యాంకుల నుంచి వెయ్యి మందికి పైగా టిడ్కో లబ్ధిదారుల పేరుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 25 కోట్ల 67 లక్షల రుణం తీసుకుంది. వాటి తాలూక ఈఎమ్ఐలు చెల్లించాలని లేకుంటే చర్యలు తప్పవంటూ బ్యాంకర్లు లబ్ధిదారులకు ఫోన్లు, మెసేజ్లు పంపిస్తున్నారు. తాజాగా లీగల్ నోటీసులు సైతం జారీ చేస్తుండటంతో టిడ్కో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు అందిస్తారో తెలియని ఇళ్లకు రుణ వాయిదాలు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు.
టిడ్కో ఇళ్ల కోసం బ్యాంకుల నుంచి లబ్ధిదారులు పాక్షిక ఒప్పందం చేసుకుంటే రుణం మంజూరు చేసినట్లే. నాటి నుంచి రెండేళ్ల వరకు లబ్ధిదారులు వాయిదాలు చెల్లించనవసరం లేదు. ఆ గడువు కొంత మందికి ఇప్పటికే పూర్తి కావడంతో బ్యాంకుల నుంచి నోటీసులు అందుతున్నాయి. ఒకటి రెండు వాయిదాలు చెల్లించకపోతే డిఫాల్టర్లుగా మారతారని బ్యాంకర్లు హెచ్చరిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము రుణాలు కట్టలేమని బ్యాంకు అధికారులకు చెప్తున్నా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోతున్నారు. రుణాలిచ్చి, ఇళ్లు ఇవ్వకుండా బ్యాంకులు వేధింపులకు దిగడం సరికాదంటున్నారు.