Varra Ravinder Reddy Remand Report:సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి సజ్జల భార్గవ్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టామని వైఎస్సార్సీపీ సామాజిక కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అంగీకరించారు. ఇవాళ తెల్లవారుజామున కడప రెండో అదనపు మెజిస్ట్రేట్ ముందు వర్రాను పోలీసులు హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ కోసం కడప జైలుకు తరలించారు. పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి నేరాన్ని అంగీకరించిన రిమాండ్ రిపోర్టులోని పలు అంశాలు బయటికి వచ్చాయి.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై పోస్టులు పెట్టలేదని సజ్జల భార్గవ్ రెడ్డి తనను తీవ్రంగా బెదిరించారని వర్రా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆరోజు నుంచి తన ఐడీ, పాస్ వర్డ్ ఆయన వద్దే ఉంచుకున్నారని అన్నారు. 2023 జనవరిలో షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకరమైన రీతిలో పోస్టులు పెట్టినందుకు వారు తనపై హైదరాబాద్‌లో కేసులు పెట్టారన్నారు. వీరిపై పోస్టులు పెట్టాలనే కంటెంట్ ఇచ్చింది అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కాగా ఆ పోస్టులు ఎలా పెట్టాలనేది మాత్రం అవినాష్ రెడ్డి, రాఘవరెడ్డి పలుమార్లు చర్చించుకున్నారని తెలిపారు.