YSRCP Office Demolished in Tadepalli :గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద జలవనరులశాఖకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని (YSRCP Office Illegal Construction) సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా బోటు యార్డులోని జలవనరుల శాఖకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ ధరకే లీజుకు కట్టబెట్టారు. ఏటా 2 వేల రూపాయలు చెల్లించేలా జీవో తెచ్చారు. ఈ స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించేందుకు అప్పటి అధికారులు చకచకా అనుమతులు ఇచ్చేశారు. జీ ప్లస్ టు లో కార్యాలయం నిర్మించేందుకు వైఎస్సార్సీపీ నేతలు నిర్మాణాలు ప్రారంభించారు.
'నేనింతే - నా తీరింతే - అసెంబ్లీకి రానంతే' - Jagan on Speaker Election Process
5 బుల్డోజర్లతో 2 గంటల్లోనే కార్యాలయం కూల్చివేత : ప్రభుత్వం మారిన నేపథ్యంలో జలవనరులశాఖ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్నారంటూ సీఆర్డీఏ అధికారులు 4 రోజుల క్రితం వైఎస్సార్సీపీకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా చట్ట నిబంధనల మేరకు నడుచుకోవాలని సీఆర్డీఏకు కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం 5 బుల్డోజర్లతో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం 2 గంటల్లోనే కూల్చివేతను అధికారులు పూర్తి చేశారు.