YSRCP neglected Mogali Gundala Reservoir Works Farmers Problems in Prakasam District:ఎన్నో ఏళ్లుగా అక్కడి రైతులకు ఎదురుచూపులే మిగిలాయి. నిధులు మంజూరై టెండర్లు పిలిచినా ప్రకాశం జిల్లా మొగలిగుండాల జలాశయం నిర్మాణానికి మోక్షం లభించలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జలాశయ నిర్మాణాన్ని పూర్తిగా అటకెక్కించేసింది. కరవు జిల్లాలో ఈ ప్రాజెక్టుతో సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్న రైతులకు కూటమి ప్రభుత్వం రాకతో ఆశలు చిగురించాయి.
ప్రకాశం జిల్లాలో రైతుల సుదీర్ఘ కల అయిన మొగలిగుండాల జలాశయం నిర్మాణానికి నోచుకోవడంలేదు. తాళ్లూరు, చీమకుర్తి మండలాల్లోని సుమారు 10 వేల ఎకరాలకు సాగునీటి అందించేలా, పలు గ్రామాలకు తాగునీరందేలా ఈ ప్రాజెక్టు నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. జలాశయం పూర్తయితే కొండవాగుల్లోంచి వచ్చే నీటి వనరులను నిల్వచేసి దిగువన ఉన్న పంట పొలాలకు సాగునీటిని అందించే అవకాశం ఉంది.
గత కొన్నేళ్లుగా జలాశయానికి ప్రతిపాదనలు చేయటం, నిధులు మంజూరు చేసి టెండర్లు పిలవటం శంకుస్థాపనలు చేయటంతోనే సరిపుచ్చుతున్నారు. టీడీపీ హయాంలో అప్పటి మంత్రి శిద్ధా రాఘవరావు రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి శంకుస్థాపన చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ రివర్స్ టెండరింగ్ విధానంతో మళ్లీ టెండర్లు పిలిచి పూర్తి చేయకుండానే వదిలేసింది.