YSRCP Neglect Maintenance of canals in Krishna District :పంట కాలువల నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేయడంతో కృష్ణాజిల్లా రైతులు అవస్థలు పడుతున్నారు. పంట కాలువలను బాగు చేయకపోవడంతో జమ్ము, గుర్రపుడెక్క, నాచు పేరుకుపోయి కాలువలు అధ్వానంగా మారాయి. నీటి ప్రవాహానికి ఇవి అడ్డగా ఉండటంతో పంట పొలాలకు నీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వర్షం వస్తే పొలాల్లోని నీరు బయటకు పోయే పరిస్థితి లేదని, దీని వల్ల పంటలు ముంపునకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
కాలువల నిర్వహణ రైతుల పాలిట శాపం : కృష్ణా జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన పంట కాలువల నిర్వహణ రైతుల పాలిట శాపంగా మారింది. గత ఏడాది కాలువల మరమ్మతులు చేపట్టకపోవడంతో జులైలో కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాల్లో పంట నీట మునిగి, రైతులు నష్టపోయారు. కాలువల మరమ్మతులకు నీటిపారుదలశాఖ ఏటా నిధుల కోసం ప్రతిపాదనలు పంపడం, ప్రభుత్వం ఆలస్యంగా ఆమోదం తెలపడం, ఇంతలో నీటి విడుదల జరగడం ఆ తరువాత పైపై పనులు చేయడం నిధులతో రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడం షరా మామూలైంది.
రైతులకు సంకటంగా అధికారుల అలసత్వం - Officers Neglect Repairing Drains
అధిక వర్షాలు కురిస్తే ముంపు సమస్య :డెల్టాలోని అన్ని ప్రధాన, అనుబంధ కాల్వల్లో తూటుకాడ భారీగా పేరుకుపోయింది. పెనమలూరు, గుడివాడ, పామర్రు, మచిలీపట్నం, గూడూరు, పెడన మండలాల్లో గుర్రపుడెక్క, నాచు తొలగింపు పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి. మరోవైపు వేసవిలో జమ్ము, గుర్రపుడెక్క నిర్మూలనకు రసాయనాలు పిచికారీ చేయకపోవడంతో అధిక వర్షాలు కురిస్తే ముంపు సమస్య ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వ్యవసాయ ప్రధానమైన కృష్ణాజిల్లాలో కాల్వ నీటిపై ఆధారపడి పంటలు సాగవుతున్నాయి. కృష్ణా నది అనుబంధంగా ఉన్న కాలువల కింద మొత్తం 7,36,531 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఈ కాల్వలకు ఏటా కనీస నిర్వహణ చేపట్టకపోవడంతో రైతులకు సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది గుత్తేదారులు ఆపరేషన్, మెయింటెన్సు పనులకు కనిష్టంగా 30% నుంచి గరిష్టంగా 41% తక్కువ ధరలకు టెండర్లను దాఖలు చేశారు.