Mumbai Actress Torture Case in AP : ముంబయికి చెందిన సినీనటిపై వైఎస్సార్సీపీ పెద్దలు, ఐపీఎస్ అధికారులు వేధింపుల వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. సజ్జన్ జిందాల్‌పై ముంబయిలో నమోదైన కేసును సెటిల్ చేసేందుకే ఆమెపై కేసు నమోదు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సజ్జన్ జిందాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముంబయిలోని బాంద్ర-కుర్ల కాంప్లెక్స్ పోలీస్‌స్టేషన్‌లో సినీనటి కొన్నాళ్ల కిందట ఫిర్యాదు చేశారు. పోలీసులు సరిగ్గా స్పందించకపోవటంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
సజ్జన్ జిందాల్‌పై కేసు :బాంబే హైకోర్టు ఆదేశాలతో గతేడాది డిసెంబర్‌లో సజ్జన్ జిందాల్‌పై అత్యాచారంతో పాటు పలు అభియోగాల కింద కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసు ముంబయిలో సంచలనంగా మారింది. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలోనే విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో ఫిబ్రవరిలో సినీనటితో పాటు ఆమె తల్లీదండ్రులపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
YSRCP Leaders Torcher To Mumbai Heroin : ఆ వెంటనే ఆగమేఘాలపైన నాటి డీసీపీ విశాల్ గున్నీ, ఏడీసీపీ రమణమూర్తి, ఏసీపీ హనుమంతురావు, సీఐ శ్రీధర్, ఎస్సై షరిఫ్ తదితరులతో కూడిన బృందం విమానంలో ముంబయి వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడకు తీసుకురావటం శరవేగంగా జరిగిపోయాయి. మార్చి 15 వరకు సినీనటి, ఆమె తల్లీదండ్రులు విజయవాడ జైల్లోనే ఉన్నారు. అంతకు ముందు ఫిబ్రవరి 10 నుంచి 14 వరకూ వారిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు.
YSRCP Leader kukkala Vidya Sagar Issue : ఈ క్రమంలో తాము చెప్పినవాటికల్లా అంగీకరిస్తే బెయిల్ వచ్చేలా చేస్తామని లేదంటే నెలల తరబడి జైల్లోనే మగ్గిపోవాల్సి ఉంటుందని వారిని నాటి పోలీసు అధికారులు బెదిరించారు. దిక్కుతోచని స్థితిలో వారు అందుకు అంగీకరించారు. దీంతో ఖాకీలే వారికి బెయిల్ ఇప్పించి విడుదలయ్యేలా చేశారు. అనంతరం వారి నుంచి పలు కీలక పత్రాలు, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబం ఆ తర్వాత ముంబయికి వెళ్లిపోయింది.
క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిన పోలీసులు :విజయవాడ జైలు నుంచి సినీనటి కుటుంబం విడుదలైన రెండు రోజులకే బాంద్ర-కుర్ల కాంప్లెక్స్ పోలీస్‌స్టేషన్‌లో సజ్జన్ జిందాల్‌పై నమోదైన కేసును అక్కడి పోలీసులు మూసేశారు. ఆ మేరకు అక్కడి న్యాయస్థానంలో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారు. అత్యాచారం జరిగిందనేందుకు తగిన ఆధారాలు బాధితురాలు సమర్పించలేదని, వాంగ్మూలమివ్వటానికి రావాలని పదే పదే కోరినా రాలేదని పేర్కొంటూ కేసును మూసివేశారు.