ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలో దారుణం - అభిషేకం సరిగా చేయలేదని అర్చకుడిని కాలితో తన్నిన వైసీపీ నేత - YSRCP Leader Attack on Priest

YSRCP Leader Attacked Priest in Kakinada: సాక్షాత్తూ శివాలయంలోనే అర్చకులపై వైసీపీ నేత దౌర్జన్యానికి దిగారు. గుడిలోనే అర్చకులను కాలితో తన్ని, దవడపై కొట్టారు. అసభ్యపదజాలంతో దూషించారు. అభిషేకం సరిగా చేయలేదని గుడిలో బూతుపురాణం అందుకున్నారు. కాకినాడలోని పురాతన శివాలయంలో భక్తుల సమక్షంలోనే ఈ దారుణానికి పాల్పడ్డారు.

YSRCP_Leader_Attacked_Priest_In_Kakinada
YSRCP_Leader_Attacked_Priest_In_Kakinada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 8:07 AM IST

Updated : Mar 26, 2024, 10:53 AM IST

YSRCP Leader Attack on Priest in Kakinada : ఫాల్గుణ పౌర్ణమి, సోమవారం సందర్భంగా శివాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. అదే సమయంలో మాజీ కార్పొరేటర్‌, వైసీపీ నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజా సామగ్రి తీసుకున్న అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యారు. అయితే తాను తీసుకొచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని, అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ సిరియాల చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయారు.

కాకినాడలో దారుణం - అభిషేకం సరిగా చేయలేదని అర్చకుడిని కాలితో తన్నిన వైసీపీ నేత

సహాయ అర్చకుడు పి. వెంకట సత్యసాయి తోటి భక్తులతో పాటు ఆయనకూ ప్రసాదం ఇస్తుండగా, కోపోద్రిక్తుడైన వైసీపీ నేత అర్చకుడి చెంపపై కొట్టారు. ఏం తప్పు చేశానని అర్చకుడు ప్రశ్నించడంతో నాకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ అసభ్య పదజాలంతో తిట్టి, కాలితో తన్నడంతో ఆయన కింద పడ్డారు. వైసీపీ నాయకుడి కేకలు విని పక్కనే ఉపాలయంలో పూజలు చేస్తున్న మరో అర్చకుడు మద్దిరాల విజయ్‌కుమార్‌ వచ్చి అడ్డుకోబోగా ఆయన చెంపపై కూడా కొట్టారు. అసభ్యపదజాలంతో దూషించడమే కాక మీ అంతు చూస్తానంటూ వీరంగం సృష్టించారు. ఈ తతంగానికి భక్తులు నివ్వెరపోయారు.

Priests Dharna in Gorantla సెలవు కావాలన్న అర్చకుడిపై ఆలయ కమిటీ దాడి.. ధర్నాకు దిగిన అర్చకులు

ఫిర్యాదు చేసిన అర్చక సంఘం ప్రతినిధులు :ఈ ఘటనను జిల్లా అర్చక సంఘం ప్రతినిధులు దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ, జిల్లా దేవాదాయ అధికారి పులి నారాయణమూర్తి, తనిఖీదారు ఫణీంద్రకుమార్‌తో పాటు డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. పులి నారాయణమూర్తిని అది తనకు సంబంధించిన విషయం కాదని, డిప్యూటీ కమిషనర్‌ను వెళ్లి కలవాలని సూచించడంతో అర్చకులు ఆందోళనకు దిగారు. అర్చకుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫణీంద్రకుమార్‌ ఘటనపై ఆరా తీశారు. ఉన్నతాధికారుల సూచనలతో ఆలయ ఈవో రాజేశ్వరరావు బాధిత అర్చకులతో కలిసి కాకినాడ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు (అర్చకుల)పై దాడి, విధులకు ఆటంకం కలిగించారనే నేరాలపై సెక్షన్‌ 332 కింద సీఐ సురేశ్‌బాబు కేసు నమోదు చేశారు.

కేసు నమోదు చేయడానికి తర్జనభర్జన:అర్చకులపై దాడి ఘటనలో పోలీసుల వరకు వెళ్లొద్దని వైసీపీ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడానికి తర్జనభర్జన పడ్డారు. ఆలయంలో సీసీ కెమెరాలున్నా, దాడి దృశ్యాలు ఉద్దేశపూర్వకంగా బయటకు రానీయకుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్‌, అఖిల భారత బ్రాహ్మణ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌ తదితరులు డిమాండ్‌ చేశారు. న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతామని బ్రాహ్మణ సంఘాల నాయకులు హెచ్చరించారు.

Priest Murder: పశ్చిమగోదావరి జిల్లాలో పూజారి దారుణ హత్య

దాడిని ఖండించిన అర్చకుల సంఘం: అర్చకులపై దాడిని అర్చకుల సంఘం ఖండించింది. అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్‌కుమార్‌పై దాడిచేసిన వైసీపీ నాయకుడు చంద్రరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమపై అకారణంగా దాడిచేశారని అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే అర్చక సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని అర్చకులు హెచ్చరించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అర్చకులు, చంద్రరావు అరెస్టుకు డిమాండ్‌ చేశారు.

Nara Lokesh Tweet about Attack on Priest: మరోవైపు దాడి ఘనటపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. వైసీపీ మూకల అరాచకానికి అడ్డూఅదుపు లేకుండా పోతోందని మండిపడ్డారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో ప్రశాంతంగా జీవనం సాగించలేని పరిస్థితి ఉందని, ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. భగవంతుడి సేవ తప్ప మరో ధ్యాసలేని అర్చకులపైనా ప్రతాపమా అంటూ ప్రశ్నించారు. పూజారులపై దాడిచేసిన వైసీపీ నేతను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరో 2 నెలల్లో ప్రజా ప్రభుత్వం రాబోతోందని, ఈలోగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పోలీసులకు విన్నవిస్తున్నానన్నారు.

టీడీపీ సానుభూతిపరురాలిపై వైఎస్సార్సీపీ నేతల దాడి- వీడియో వైరల్​

Last Updated : Mar 26, 2024, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details