New Double Decker Bus Parked at Dumping Yard In Tirupati :గత ఏడాది ఆగస్టు 8న తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ నిధులతో డబుల్ డెక్కర్ బస్సు కొనాలని కౌన్సిల్‌లో ప్రతిపాదించారు. డబుల్‌డెక్కర్ బస్సు తిరిగే స్థాయిలో తిరుపతి నగర రహదారులు, పరిస్థితులపై అంచనా లేకుండానే ఆగమేఘాలపై బస్సు కొనేశారు. బస్సు కొన్న తర్వాత ఆర్టీసీకి అప్పగించి అద్దె వసూలు చేయాలనుకున్నారు. ఆర్టీసీ నిరాకరించడంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బస్సు నడిపి టికెట్లు వసూలు చేయాలని నిర్ణయించారు.
ఇరుకు రోడ్ల నగరంలో డబుల్ డెక్కర్ బస్సు తిప్పడం కష్టమవడంతో రాత్రికిరాత్రే పచ్చదనంపై వేటు వేస్తూ 2వేలకు పైగా చెట్ల కొమ్మలను నరికేశారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులను గతేడాది అక్టోబరు 12న ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేశారు. ఎక్కడ ఎక్కినా ఎక్కడ దిగినా ఛార్జీ 50 రూపాయలుగా నిర్ణయించారు. బస్సు ఎక్కేవారు లేకపోవడంతో కొంత కాలం ఉచితంగా తిప్పినా జనం పట్టించుకొలేదు. తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్సు తిరుగుతూ ఉంటే ఎక్కడానికి జనం ఎగబడతారని తిరుపతి మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్‌రెడ్డి వేసిన అంచనా తలకిందులైంది.
'బస్సుకు రిజిస్ట్రేషన్ లేకపోవడంపై రవాణా శాఖ అధికారులు అభ్యంతరం చెప్పారు. దీంతో బస్సును బయటకు తీయడం మానేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ చెత్త వాహనాలు నిలిపే ప్రాంతంలో రెండున్నర కోట్ల రూపాయల డబుల్ డెక్కర్ బస్సుని ఉంచారు. చిన్న సైజు సెట్విన్ బస్సులు కొని నగరంలో తిప్పితే ప్రజలకు అందుబాటులో ఉండేవి. కమీషన్ల కోసం డిప్యూటీ మేయర్ డబుల్‌డెక్కర్ బస్సు కొనుగోలు చేశారు.' -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ నరసింహాచారి.