YSRCP Key Leaders Joining TDP: త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. అయితే అంతకుముందే అధికార వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అధికార పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వైసీపీ అధిష్ఠానం ఉంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ (Vasantha Venkata Krishna Prasad) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు హైదరాబాదుకు బయలుదేరి వెళ్లారు.
ముందుగా నందిగామ మండలం అంబర్‌పేటలోని శ్రీ సత్యమ్మ అమ్మవారి దేవాలయంలో సతీమణి శిరీషతో కలిసి ఎమ్మెల్యే వసంత ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి మైలవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు వసంత నివాసానికి పోటెత్తారు. వారందరితో ఉదయం నుంచి మాట్లాడారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఆయన స్వగ్రామం ఐతవరం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆయన తండ్రి మాజీ హోం శాఖ మంత్రి వసంత నాగేశ్వర ఆశీస్సులు తీసుకొని బయలుదేరి వెళ్లారు.
ఎన్నికల కన్నా ముందే నెల్లూరులో వైసీపీ ఖాళీ !
శనివారం ఉదయం 9 గంటలకు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. ఈ ఉద్దేశంతోనే తాను వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నట్లు చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నడుచుకుంటానని వసంత చెప్పారు. తాను ఎక్కడ పోటీ చేసే విషయం కూడా చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. వసంత వెంట వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీపీలు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు.