ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బూతులు తిట్టనందుకేనా మహీధర్‌రెడ్డి సీటులో మార్పు - ఎడం బాలాజీకి ఎందుకు బాధ్యతలు

YSRCP Incharges 7th List : ఇన్‌ఛార్జుల మార్పులతో ఏడో జాబితాను వైఎస్సార్​సీపీ విడుదల చేసింది. ఈ జాబితాలో మరో 2 నియోజకవర్గ ఇంఛార్జ్‌లను ప్రకటించింది. బాబు, పవన్‌లపై దుమ్మెత్తలేదని మహీధర్‌రెడ్డిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. కందుకూరులో పార్టీ బాధ్యతలు అరవిందకు అప్పగించారు.

ysrcp_incharges_7th_list
ysrcp_incharges_7th_list

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 12:03 PM IST

వ్యక్తిత్వాలపై నీచాలకు పోనందుకేనా మహీధర్‌రెడ్డి సీటులో మార్పు - ఎడం బాలాజీకి ఎందుకు బాధ్యతలు

YSRCP Incharges 7th List :అధికార వైఎస్సార్​సీపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సీట్లు చిరిగాయి. చంద్రబాబు, పవన్‌లపై దుమ్మెత్తలేదని మహీధర్‌రెడ్డికి టికెట్‌ దక్కకపోగా కందుకూరులో పార్టీ బాధ్యతలు అరవిందకు అప్పగించారు. పర్చూరు నుంచి ఆమంచిని తొలగించి ఎడం బాలాజీకి బాధ్యతలు ఇచ్చారు. ఇద్దరి పేర్లతో ఏడో జాబితాను వైఎస్సార్​సీపీ విడుదల చేసింది.

ప్రతిపక్షాలను తాము చెప్పినట్లుగా తిట్టకపోతే తీసేయడమే. ఇదే వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో నడుస్తున్న ట్రెండ్‌. తాజాగా కందుకూరు సీనియర్‌ ఎమ్మెల్యే మానుగుండ మహీధర్‌రెడ్డి పైనా ఇదే కారణంతో వేటు వేశారు. కందుకూరు వైఎస్సార్​సీపీ సమన్వయకర్తగా అరవిందా యాదవ్‌కు అప్పగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.

ఈ నెల 8న డాక్టర్‌ పెంచలయ్య సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఆయన కుమార్తె అరవిందా యాదవ్‌కు కందుకూరు అప్పగించారు. మాజీమంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డిని పక్కన పెట్టేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లను ప్రెస్‌మీట్లు పెట్టి తిట్టాలని వారి వ్యక్తిత్వాలపై నీచంగా మాట్లాడాలని వైఎస్సార్​సీపీ ముఖ్య నేతలు ఇటీవల మహీధర్‌రెడ్డికి చెప్పారు. ఆయన సమ్మతించలేదు.

పోలీసులా? వైఎస్సార్​సీపీ కార్యకర్తలా? - అధికార పార్టీకి దాసోహమైన ఖాకీలు

స్వతంత్రంగా పోటీ చేసి కూడా గెలిచిన చరిత్ర ఉన్న కుటుంబం తనదని వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాల వారిని తిట్టమంటే తన వల్ల కాదని తేల్చి చెప్పేశారు. అప్పటి నుంచి కందుకూరులో మహీధర్‌ రెడ్డిని మార్చబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన రామారావు అనే నాయకుడిని సీఎం పిలిపించుకుని మాట్లాడారు. ఆయనను కందుకూరుకు పంపనున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. తర్వాత కనిగిరి సిటింగ్‌ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు అక్కడ టికెట్‌ లేకుండా చేసినపుడు ప్రత్యామ్నాయంగా ఆయన్ను కందుకూరుకు మారుస్తారనే మాట వినిపించింది.

వారం కింద పెంచలయ్యను పార్టీలో చేర్చుకుని ఆయన కుమార్తెను ఇప్పుడు కందుకూరు సమన్వయకర్తగా నియమించారు. ఇవన్నీ జరుగుతుండగానే గత నెలలో మహీధర్‌రెడ్డిని సీఎం ఒకసారి పిలిపించుకుని మాట్లాడారు. మీ ఇష్టం మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండంటూ మహీధర్‌రెడ్డి, సీఎంకు స్పష్టం చేశారని వార్తలొచ్చాయి

వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యేలకు మరోషాక్ ఇవ్వనున్న జగన్ - త్వరలోనే మరో లిస్ట్ విడుదల!

చీరాల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న ఎడం బాలాజీ కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం విదేశాలకు వెళ్లారు. ఆయన్ను అక్కడి నుంచి పిలిపించుకుని మరీ పర్చూరు బాధ్యతలను అప్పగించారు. బాలాజీ శుక్రవారం సాయంత్రమే సీఎం జగన్‌ను కలిశారు. వైఎస్సార్​సీపీలో ఇంకా చేరలేదు. కానీ, రాత్రికే పర్చూరు సమన్వయకర్తగా ప్రకటించారు. బాలాజీ 2014లో వైఎస్సార్​సీపీ అభ్యర్థిగా చీరాలలో పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్‌ చేతిలో ఓడిపోయారు.

2019లో వైఎస్సార్​సీపీ టికెట్‌ దక్కకపోవడంతో టీడీపీలో చేరారు. ఇప్పుడు పర్చూరులో వైఎస్సార్​సీపీ అభ్యర్థి కాబోతున్నారు. ఇప్పటివరకూ పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్​సీపీ సమన్వయకర్తగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ను ఈ నెల 5న సీఎం పిలిపించుకుని మాట్లాడారు. ఆమంచి తన సొంత నియోజకవర్గమైన చీరాలలోనే పోటీ చేయాలని భావిస్తున్నారు. గత నెలలో అనుచరులతో సమావేశమై అదేమాట చెప్పారు. ఆ విషయం బయటకు పొక్కడంతో సీఎం పిలిపించి మాట్లాడారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్​ఛార్జ్ బాధ్యతలు.. ఎంపీ కేశినేనికే

కానీ ఆమంచి చివరి నిమిషంలో చెయ్యి ఇస్తారేమో అనే అనుమానంతో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయాలని సీఎం పార్టీ ఇన్‌ఛార్జీలు, ఐ-ప్యాక్‌ వారికి చెప్పినట్లు తెలిసింది. ఆమంచికి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య వివాదాలున్నాయి. ఆమంచి సామాజికవర్గానికే చెందిన బాలాజీని పర్చూరుకు పరిశీలించవచ్చని బాలినేని సీఎంకు చెప్పినట్లు సమాచారం. తర్వాతే బాలాజీని నియమించేందుకు సీఎం అంగీకరించారంటున్నారు.

మహీధర్‌రెడ్డి, ఆమంచి భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉండబోతోందనేది చర్చనీయాంశమైంది. ఈ అవమానకర పరిస్థితిని మహీధర్‌ ఎలా పరిగణించబోతున్నారు. వైఎస్సార్​సీపీలో కొనసాగుతారా లేదా అనే విషయంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొదటి నుంచి పర్చూరు వద్దు, తన చీరాల తనకు ఇవ్వండి అంటున్న ఆమంచి ఇప్పుడేం చేస్తారు. చీరాల నుంచే పోటీ చేస్తా వైఎస్సార్​సీపీ అభ్యర్థిగానా, మరో పార్టీలోనా లేదా స్వతంత్రంగానా అనేది తర్వాత సంగతి అని తన కార్యకర్తలకు చెప్పినట్లు తెలిసింది. మరి ఆమంచి చీరాలలోనే బరిలో దిగబోతున్నారా అనేది తేలాల్సి ఉంది.

పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి అక్కడ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డిలను కలిసినట్లు తెలిసింది.

వైఎస్సార్సీపీలో గొంతెత్తి ప్రశ్నిస్తే - వేటేస్తారు జాగ్రత్త సుమీ!

ABOUT THE AUTHOR

...view details