YSRCP Govt Reverse Tendering on Polavaram: రివర్స్ టెండరింగ్‌పై పోలవంరం ప్రాజెక్టు అథారిటీ వద్దని చెప్పినా నాటి సీఎం జగన్ వినలేదు. పట్టుబట్టి కాంట్రాక్టరును మార్చేయడం, గుత్తేదారు మేఘా సంస్థ వెంటనే పనులు చేపట్టకపోవడంతో పోలవరం ప్రాజెక్టుకు పెనుశాపంగా మారింది. జగన్ అధికారంలోకి రాగానే పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో రూ. 628 కోట్లు ఆదా చేసినట్లు చూపించి రాష్ట్రాన్ని ఉద్ధరించినట్లుగా కబుర్లు చెప్పి, అప్పటికే 72 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టును కుట్రపూరితంగా మేఘా చేతిలో పెట్టారు.
2019 నవంబరులో ప్రాజెక్టును అప్పగిస్తే అప్పటి కొత్త గుత్తేదారు మేఘా 2020 జూన్ వరకు పనులే ప్రారంభించలేదు. ఈ ఆలస్యం ప్రాజెక్టును తీవ్రంగా దెబ్బతీసింది. ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీలను పూడ్చి, లీకులు అరికట్టకపోవడంతో 2020 భారీ వరదలకు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. ప్రధాన డ్యాం నిర్మాణం వద్ద భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్ డ్యాం దెబ్బతింది. గైడ్‌బండ్ కుంగిపోయింది. 2019లో మేఘా సంస్థతో 15 వందల 48.12 కోట్లకు ఒప్పందం జరిగింది.
అలా ఖజానాకు 628 కోట్లు మిగిల్చినట్లు ప్రచారం చేసుకున్నారు కానీ, ఆ తర్వాత పని విలువ క్రమంగా పెంచేశారు. కొన్ని పనులు తొలగించి, మరికొన్ని పెంచి అదనపు ఒప్పందాలు చేసుకుని పని విలువను 2 వేల 77.78 కోట్లకు పెంచేసినట్టు సమాచారం. అది చాలదన్నట్టు కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ సిఫార్సు చేశాయన్న పేరుతో 669.47 కోట్లు, 16 వందల 15.75 కోట్లతో రెండుసార్లు అదనంగా మరిన్ని పనులకు టెండర్లు పిలిచారు. వాటి అంచనాల్ని కొత్త ధరలతో రూపొందించారు.
పోలవరం క్రస్ట్ గేట్లను తాకిన గోదారమ్మ- 43 వేల క్యూసెక్కుల నీటి విడుదల - water level at Polavaram project
మేఘాతో పాటు మరో గుత్తేదారు సంస్థ మాత్రమే ఈ టెండర్ల ప్రక్రియలో పాలుపంచుకుంది. కానీ, కేవలం 1.980శాతం తక్కువకు మొదటి టెండరును, 1.0240 శాతం తక్కువకు రెండో టెండరును మేఘా దక్కించుకుంది. దీని వెనుక జగన్ ప్రభుత్వ సహకారం చాలానే ఉందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఇంకా అదనపు జోడింపులు, డీవియేషన్స్ పేరుతో ఆ పనుల అంచనాలనూ జగన్ ప్రభుత్వం పెంచేసుకుంది. 2 వేల167 కోట్ల విలువైన పనులకు ఒప్పందాలు చేసుకుని వాటిని క్రమంగా 2 వేల 559.31 కోట్లకు చేర్చింది. మొత్తమ్మీద మొదట్లో 1,548 కోట్లు అనుకున్న పనులు కాస్తా చివరకు ఏకంగా 4 వేల637.09 కోట్లకు చేరాయి.
గుత్తేదారును మార్చొద్దని కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం అథారిటీ నెత్తీనోరూ కొట్టుకుని మొత్తుకున్నా జగన్‌కు చెవికెక్కలేదు. పోలవరం గుత్తేదారును మారిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో జగన్‌కు చిలకకి చెప్పినట్టు చెప్పాయి. పదే పదే లేఖలు రాశాయి. ప్రత్యేకంగా పోలవరం అథారిటీ సమావేశం ఏర్పాటుచేసి గుత్తేదారును మార్చడం వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిణామాలపై చర్చించింది. కానీ, పనులు ఎవరికి కట్టబెట్టాలో అప్పటికే నిర్ణయించుకున్న జగన్ ఆ సూచనలన్నింటినీ పెడచెవిన పెట్టారు.
చివరకు అందరూ భయపడ్డట్టే ప్రాజెక్టు సంక్షోభంలో చిక్కుకుపోయింది. 'ఎగువ కాఫర్ డ్యాంలో ఉన్న ఖాళీలను సకాలంలో పూడ్చకపోవడం వల్లే పోలవరంలో ఇంతటి విధ్వంసం జరిగింది' అని నీతి ఆయోగ్ నియమించిన హైదరాబాద్ ఐఐటీ నిపుణుల కమిటీ నిగ్గుతేల్చింది. గుత్తేదారును మార్చేందుకు జగన్ అన్ని నిబంధనలూ ఉల్లంఘించారు. టెండర్లు పిలిచే క్రమంలో జగన్ ప్రభుత్వం సాంకేతిక అర్హతలు మార్చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. మేఘా సంస్థ ఒక్కటే టెండరు దాఖలు చేసినా అంచనా విలువ కన్నా తక్కువకే పనులు అప్పగిస్తున్నామన్న పేరుతో ఖరారు చేసేశారు. తర్వాత రెండు దఫాలుగా టెండర్లు పిలిచిన అదనపు పనులూ మేఘాకే దక్కేలా ఇతర గుత్తేదారు సంస్థల్ని జగన్ ప్రభుత్వం ప్రభావితం చేసిందన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి.
2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు 72శాతం పూర్తయ్యాయి. తర్వాత ఐదేళ్లలో కీలక కట్టడాలు తీవ్రంగా దెబ్బతిని, దాదాపు పనికిరాకుండా పోయాయి. దాంతో ప్రాజెక్టు తిరోగమనంలోకి వెళ్లి, 45శాతం పనులే పూర్తయిన స్థాయికి దిగజారింది. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. కేంద్ర జలసంఘం చేతులెత్తేసింది. చివరకు విదేశీ నిపుణుల్ని పిలిపించి ప్రాజెక్టును మళ్లీ ఎలా గాడిలో పెట్టాలన్నదానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంచనాలు పెంచేయడం, టెండర్ల ప్రక్రియను అడ్డగోలుగా నిర్వహించి ఒకే సంస్థకు మేలు జరిగేలా చేసిన తీరుపై చంద్రబాబు ప్రభుత్వం లోతైన విశ్లేషణ జరిపి, లోగుట్టు బయటపెట్టాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది.
ఆ ఆలోచన సరికాదు - నీళ్లలో ఉన్నా ఏం కాదు - Polavaram Diaphragm Wall condition