ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసలు సిసలు బాదుడంటే ఇదే! జనానికి జగన్‌ 'పన్ను' గాట్లు - Tax burden on people in ap - TAX BURDEN ON PEOPLE IN AP

YSRCP Government Tax Burden on People: మూతికి రక్తం మరకలున్న తోడేలు సాధు జంతువుల మధ్యలోకి వచ్చి తాను శాఖాహారినని వాదించిందట! ముఖ్యమంత్రి జగన్‌ తీరూ అలానే ఉంది. ఐదేళ్లలో ఏ ఒక్కవర్గాన్నీ వదలకుండా బండ బాదుడు బాదారు. ఐదేళ్లలో ప్రజలపై ఆయన మోపిన అదనపు భారాలు అక్షరాలా లక్షా 38 వేల కోట్లు.

YSRCP Government Tax Burden on People
YSRCP Government Tax Burden on People (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 10:41 AM IST

YSRCP Government Tax Burden on People :మూతికి రక్తం మరకలున్న తోడేలు సాధు జంతువుల మధ్యలోకి వచ్చి తాను శాఖాహారినని వాదించిందట! ముఖ్యమంత్రి జగన్‌ తీరూ అలానే ఉంది. కరెంటు ఛార్జీల షాక్‌లిచ్చి, ఆర్టీసీ ఛార్జీలు బాదేసి, పెట్రోల్‌ ధరలు పెంచేసి, నిత్యావసర ధరలు మండించి, మద్యంప్రియుల ఆరోగ్యాన్ని హరించి, పేద, మధ్యతరగతి వర్గాల కష్టార్జితం కాజేసి, రివర్స్‌లో తాను చేసిన మంచిని చూసి ఓటేయాలంటూ జనం చెవిలో జోరీగలా మోగుతున్నారు! ఐదేళ్లలో ఏ ఒక్కవర్గాన్నీ వదలకుండా బండ బాదుడు బాదారు. జనానికి జగన్ చేసింది మంచికాదు. మానని పన్నుల గాయలు! ఐదేళ్లలో ప్రజలపై ఆయన మోపిన అదనపు భారాలు అక్షరాలా లక్షా 38 వేల కోట్లు.

రేషన్‌ కోత - రూ.8500కోట్ల మోత :బాదుడే బాదుడు అంటూ 2019 ఎన్నికల్లో నాటి ప్రతిపక్షాన్ని తిట్టిపోసిన జగన్‌ అధికారంలోకి వచ్చాక అసలు బాదుడంటే ఎలా ఉంటుదో చూపించారు. రేషన్‌ సరుకుల్లో కోతపెట్టి.. పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపారు. గతంలో రేషన్‌ షాపులో కిలో 40 రూపాయల చొప్పున ఒక్కో కార్డుదారుకు 2 కిలోల కందిపప్పు పంపిణీ చేసేవారు. ఇప్పుడు దాన్ని కిలోకు కుదించి రేటు 67 రూపాయలకు పెంచేశారు. అదీ 9 నెలలుగా సరిగా అందడం లేదు. గతంలో కిలో చొప్పున ఇచ్చే రాగులు, జొన్నలు, గోధుమపిండి ఎత్తేశారు. రాష్ట్రంలో కోటి 47 లక్షల రేషన్‌ కార్డులుండగా రేషన్ సరుకుల కోత వల్ల పేదలపై 8 వేల500 కోట్ల రూపాయల భారం పడింది.

వసూళ్లకు చెక్ - వైఎస్సార్సీపీకి మేలు చేసేలా ఓ అధికారి కుట్ర - NO PROPERTY TAX

పెట్రో బాదుడు - రూ.24వేల కోట్లు : ఇక పెట్రోల్‌ బాదుడులో దేశంలో జగనన్నే ఛాంపియన్‌! పన్నుల రూపంలో జగన్‌ సర్కార్ లీటరు పెట్రోలుపై 29, లీటర్‌ డీజిల్‌పై 22 రూపాయలు దండుకుంటోంది. పెట్రో ఉత్పత్తులుపై కేంద్రం వసూలు చేసే పన్నులు లీటర్‌కు 20 రూపాయల లోపే. కానీ, జగన్‌ అంతకు మించి పిండుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని రేట్లు ఏపీలోనే ఉన్నాయని నాడు పెడబొబ్బలు పెట్టిన జగన్‌ అధికారంలోకి రాగానే వ్యాట్‌ రూపంలో లీటరుకు రూ.2 చొప్పున, రోడ్డు సెస్‌ పేరుతో రూపాయికి చొప్పున పెంచారు. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకతో పోలిస్తే ఏపీలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ పదిరూపాయపైనే ఎక్కువ.!

విద్యుత్‌ వడ్డన - రూ.24,856 కోట్లు :కరెంటు తీగ ముట్టుకుంటే కాదు.. బిల్లు పట్టుకుంటేనే షాక్‌కొడుతుందనే రేంజ్‌లో విద్యుత్‌ షాక్‌లిచ్చారు జగన్‌. 200రూపాయల విలువైన విద్యుత్‌ వినియోగించుకుంటే, దానికి ట్రూ అప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలంటూ రకరాకలవన్నీ కలిపేసి 400 రూపాయలు అదనంగా వడ్డించారు. ఒక్కో గృహ వినియోగదారుడిపై నెలకు సగటున నెలకు 400 చొప్పన భారం మోపారు. రాష్ట్రంలోని కోటి 96 లక్షల గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల నుంచి ఐదేళ్లలో 24 వేల 856 కోట్లు అదనంగా వసూలు చేశారు.

మద్యం బాదుడు - రూ.54వేల కోట్లు : మద్యం ధరలు భారీగా పెంచేసి పేదల రక్త మాంసాలనూ జలగలాపీల్చేశారు జగన్‌! పొద్దస్తమానం పనిచేసే కార్మికులు సాయంత్రానికి ఒక క్వార్టర్‌ మద్యం తీసుకుంటారు. గతంలో 400 రూపాయల ఆదాయం వస్తే అందులో 100 రూపాయలు మద్యానికి ఖర్చయ్యేది. రూ.300 ఇంట్లో ఇచ్చేవారు. ఇప్పుడు రివర్స్ అయింది. పేదల ఆదాయంలో మూడొంతులు ఖాళీచేయడమేకాకుండా నాసిరకం జే బ్రాండ్లతో అనారోగ్యానికి గురి చేసి ఇంటిల్లిపాదినీ రోడ్డుమీదకు తెస్తున్నారు. నాసిరకం మద్యాన్ని మద్యం అధిక ధరలకు అమ్మి, ప్రజలను అనారోగ్యంపాలుజేశారు. ఐదేళ్లలో మద్యం వల్ల పేదలు దాదాపు లక్షా20 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

ఆస్తి,చెత్తపన్ను బాదుడు - రూ.1223కోట్లు : చెత్తపైనా పన్ను వేసి ప్రజల్ని పిండే విషయంలో పైసా కూడా తగ్గేది లేదని చాటుకున్నారు జగన్. వార్షిక అద్దె విలువ ఆధారంగా నిర్ణయించే పన్ను విధానాన్ని మార్చేసి ఆస్తి మూలవిలువ ఆధారంగా బాదడం మొదలెట్టారు. ప్రతీఏటా ఆస్తిపన్ను పెంపుతో ఒక్కో కుటుంబంపై సగటున 67శాతం వడ్డించారు. ఆపై చెత్తపన్ను రూపంలో 47 పట్టణ, నగర పాలక సంస్థల్లో ఒక్కో కుటుంబంపై నెలకు సగటున 120 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఐదేళ్లలో ఆస్తిపన్ను రూపంలో 953 కోట్లు, చెత్తపన్ను రూపంలో 270 కోట్లు కలిపి 1,223 కోట్ల రూపాయలు పిండుకున్నారు.

'పన్నుల బాదుడుతో బాధలు తట్టకోలేమ్​ బాబోయ్​'

రిజిస్ట్రేషన్ బాదుడు - రూ.5వేల కోట్లు : రాష్ట్రంలో ఇల్లు, పొలం కొనాలంటే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చూసి బెంబేలెత్తే పరిస్థితి. జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువ 13% నుంచి 75% వరకు పెంచారు. 2023 నుంచి అన్ని రకాల నిర్మాణాలపై మార్కెట్‌ విలువ కంటే 5శాతం పెంచేశారు. వారసత్వంగా వచ్చిన ఉమ్మడిఆస్తిపై 3% స్టాంపు డ్యూటీ విధిస్తున్నారు. భూముల క్రమబద్దీకరణ పేరుతోనూ వసూళ్లకు తెగబడ్డారు. మొత్తంగా 5వేల కోట్ల వరకూ జనంపై భారం మోపారు.

ఆర్టీసీ బాదుడు - రూ.5,243కోట్లు :జగన్‌ అధికారంలో ఉన్న ఐదేళ్లలో మూడుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి రికార్డ్‌ సృష్టించారు. శ్రమజీవులు ఎక్కువగా తిరిగే పల్లెవెలుగు సర్వీసుల్ని వదల్లేదు. గతంలో 5 రూపాయలుగా ఉన్న కనీస ఛార్జీని 10రూపాయలకు పెంచేశారు. మదనపల్లె నుంచి బెంగళూరుకు కర్ణాటక ఆర్టీసీ బస్సు 160రూపాయలు వసూలు చేస్తుంటే అదే ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కితే 260 రూపాయలు తీసుకుంటున్నారు. ఇలా ప్రయాణికులపై పాపభీతిలేని జగన్‌ సర్కార్‌ ఏటా 2 వేల కోట్ల వరకూ అదనంగా వసూలుచేస్తోంది. ఐదేళ్లలో5,243 కోట్ల రూపాయల భారం మోపింది.

ఇసుక దోపిడీ - రూ.10వేల కోట్లు :ఇక ఇసుక నుంచైతే న్యాయస్థానాలే నోరెళ్లబెట్టే దోపిడీకి పాల్పడ్డారు. తెలుగుదేశం హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకను జగన్‌ అధికారంలోకి వచ్చీ రాగానే ఎత్తేశారు! భవన నిర్మాణ కార్మికులు, లారీ యజమానులు, డ్రైవర్లు, మెకానిక్‌లు సహా నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికుల కడుపుపై కొట్టారు. కొన్నాళ్లకు టన్ను 375 రూపాయల లెక్కన అమ్మారు. 2021 ఏప్రిల్‌ తర్వాత టన్ను ఇసుక ధర 475 రూపాయలకు పెంచారు. అధికారిక తవ్వకాలకు మించి అనధికారిక తవ్వకాలు చేశారు . మొత్తంగా ఇసుక దోపిడీ ద్వారా 10వేల కోట్లు పోగేసుకున్నారు. ఇసుక ధరల వల్ల ఒక్కో ఇంటి నిర్మాణంపై లక్ష రూపాయల వరకూ అదనపు భారం పడింది.

ఫైబర్‌ నెట్‌ బాదుడు - రూ.108కోట్లు :వినోదాన్ని భారంగా మార్చేశారు జగన్‌. తక్కువ ధరలో టీవీ, ఫోన్‌ కనెక్షన్‌ అందించే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం ఫైబర్‌ నెట్‌ పథకం తెచ్చింది. 2015 సంవత్సరంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా 4వేల400 ఖరీదు చేసే ట్రిపుల్‌ ప్లే బాక్సులను ఉచితంగా ఇవ్వడంతో పాటు, ఏడాదిన్నర ఉచిత సేవలందించారు. నిర్వహణ ఛార్జీల కింద నెలకు రూ.150 తీసుకున్నారు. తర్వాత నెలకు రూ.250 చొప్పున తీసుకొని అన్ని టీవీ ఛానెళ్లతో పాటు, అపరిమిత నెట్‌ అందించారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు నెలకు 599 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఐదేళ్లలో అలా 108 కోట్ల రూపాయలు అదనంగా పిండుకున్నారు.

వాహనాలపై పన్ను బాదుడు - రూ.1,022కోట్లు :వాహనాలపై లైఫ్‌ట్యాక్స్, హరితపన్ను రూపంలో జగన్‌ 1022 కోట్లు వసూలు చేసుకున్నారు. ఐదేళ్లలో జీవితకాల పన్నులు, హరితపన్నులు, జరిమానాలతో రవాణా రంగాన్ని చీకటిమయం చేశారు. కొత్త వాహనం కొనాలంటేనే బెంబేలెత్తేలా చేశారు.

ఓటీఎస్‌ బాదుడు - రూ.350కోట్లు :వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ పేరుతో ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్లలో నివసించే పేదల మెడపైనా కత్తిపెట్టారు. 1983 సంవత్సరం నుంచి పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాలు క్రమబద్దీకరించి రిజిస్ట్రేషన్‌ చేస్తామంటూ కొత్త వసూళ్లకు తెరతీశారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.15 వేలు, నగరాల్లో రూ.20 వేలు చొప్పున చెల్లించాలని ఉత్తర్వులిచ్చారు. జనం ఎదురుతిరేసరికి పట్టణ, నగర ప్రాంతాల్లోనూ ఓటీఎస్ ఛార్జీలను 10 వేలకు తగ్గించారు. అలా పేదల నుంచి 350 కోట్ల రూపాయలు గుంజుకున్నారు. లబ్ధిదారుల నుంచి ప్రతిఘటన తీవ్రమవడంతో వసూళ్లు ఆపేసినా ఇంకా 39 లక్షల మందిపై ఓటీఎస్ కత్తి వేలాడుతూనే ఉంది.

'మీసేవ' బాదుడు - రూ.120 కోట్లు :జగన్‌ ధనదాహం మీ సేవ కేంద్రాలనూ వదల్లేదు. మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవల సర్వీస్‌ ఛార్జీలను 5 రూపాయల చొప్పున వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచేసింది. విద్యార్థులు, రైతులకు, ఇతర వర్గాలకు ఇచ్చే ధ్రువపత్రాలనూ వదల్లేదు. గతంలో వివాహ రిజిస్ట్రేషన్‌ ఫీజులు 20 నుంచి 200 రూపాయలు ఉండేది. జగన్‌ ఆ ఛార్జీలను 500లకు పెంచేశారు. మొత్తంగా 120 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు! ఇవన్నీ జగన్‌కు మంచిపనులేమోగానీ ప్రజలకు మాత్రం జీవితాంతం మానని పన్నుల గాయాలే.

చెత్తపై వినియోగ రుసుముతో జనం బెంబేలు - పట్టణ ప్రజలపై బాదుడుకు జగన్ సర్కారు సిద్ధం

జగన్‌ 'పన్ను'పోట్లు - జనానికి మానని గాట్లు! (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details