YSRCP Government Neglected Handloom Industries:పరిశ్రమల స్థాపనకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలకు తోడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్- ఏపీఐడీసీ(APIDC)ని పునరుద్ధరించి నిరుద్యోగ యువతకు రాయితీ అందించే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏటా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తానని చెప్పి ఐదేళ్లలో రెండుసార్లే బటన్ నొక్కారు. 2020లో 962.42 కోట్లు, 2021లో స్పిన్నింగ్ మిల్లులకు 684 కోట్లు, ఎంఎస్ఎం(MSM)లకు 440 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాతి మూడేళ్లు చెల్లించాల్సిన రెండున్నర వేలకోట్ల రాయితీలకు మంగళం పాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తామంటూ ఇచ్చిన హామీని గాలికొదిలేసి మూడోసారీ మాట తప్పారు.
భారీగా భూముల ధరలు: పరిశ్రమలకు కేటాయించే భూములపై రాయితీలు కల్పిస్తామని గత మ్యానిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు. కానీ రాయితీపై కొత్తగా భూములివ్వడం దేవుడెరుగు పారిశ్రామికపార్కుల్లో స్థలాల ధరలు అమాంతం పెంచారు. కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం పారిశ్రామిక పార్కులో పరిశ్రమలకు గత తెలుగుదేశం ప్రభుత్వం ఎకరా 8 లక్షల రూపాయలకు కేటాయించింది. అదే స్థలాన్ని వైసీపీ సర్కార్ ఇప్పుడు 88 లక్షలకు పెంచేంసింది. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో గత ప్రభుత్వం ఎకరా 16న్నర లక్షల లెక్కన కేటాయిస్తే జగన్ సర్కార్ ఎకరా ధర 80 లక్షలకు పెంచింది. గతంలో భూములు పొందిన పారిశ్రామికవేత్తలూ కొత్త ఛార్జీలకు అనుగుణంగా డబ్బు చెల్లించాలంటూ నోటీసులు పంపింది. చేసేదేమీలేక చాలా మంది పెట్టుబడుల ప్రతిపాదన విరమించుకుని తెలంగాణకు వెళ్లిపోయారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని అత్తివరం పారిశ్రామిక పార్కులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ గత ప్రభుత్వం ఎకరా 14 లక్షల చొప్పున ఇస్తే జగన్ సర్కారు రాగానే ఆ మొత్తాన్ని 58లక్షల 68 వేల రూపాయలకు పెంచింది. పరిశ్రమలకు అవుట్ రైట్ సేల్స్-ఓఆర్ఎస్ కింద భూములను కేటాయించే నిబంధనకు వైసీపీ సర్కారు మూర్పులు చేసింది. ముందుగా లీజు విధానంలో కేటాయించి 10ఏళ్ల నిర్వహణ తర్వాత రిజిస్ట్రేషన్ చేసేలా 'లీజు కం బై' విధానాన్ని తెచ్చింది. ఈ విధానంలో పారిశ్రామికవేత్తలకు ఖర్చు మిగులుతుందని ప్రభుత్వం చెప్పింది. దీనిపై వ్యతిరేకత రావడంతో గతేడాది నవంబరులో మళ్లీ ఓఆర్ఎస్ పద్ధతినే అమలు చేస్తున్నట్లు సవరణ ఉత్తర్వులిచ్చింది. భూముల ధరలను ప్రభుత్వం భారీగా పెంచడంతో ఏపీఐఐసీ(APIIC) పారిశ్రామికపార్కుల్లో భూములు తీసుకునేవారు లేక 44 వేల 767 ఎకరాలు మిగిలిపోయాయి.
రాయతీల్లో కోత: పన్నుల్లో రాయితీ ఇస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాకా ఫీజుల వాత పెట్టారు. గతంలో భవనాల వరకే పన్ను లెక్కించే విధానానికి బదులు పూర్తి విస్తీర్ణానికి పన్ను లెక్కించే విధానం తెచ్చారు. అదీ చాలదన్నట్లు ఏటా 5 శాతం పన్ను పెంపు వర్తించేలా నిబంధన విధించారు. దీనివల్ల ఒక మోస్తరు పరిశ్రమపై ఏటా 30 వేలకుపైగా అదనపు భారం పడింది. వార్షిక లైసెన్సు ఫీజులనూ వైసీపీ సర్కార్ 2023లో భారీగా పెంచేసింది. ఉత్తర్వులిచ్చిన తేదీ నుంచి కాకుండా 2019 నుంచి లెక్కగట్టి మరీ రెట్రాస్పెక్టివ్ వసూలు చేసింది. కాలుష్య నియంత్రణ మండలి లైసెన్సు కోసం 2019లో మూడేళ్లకు 90 వేల చొప్పున చెల్లించే మొత్తాన్ని ఏకంగా 4 లక్షల రూపాయలకు పెంచింది. అగ్నిమాపకశాఖ ఇచ్చే కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అనుమతికి ఏడాదికి లక్ష రూపాయలుగా ఉన్న ఫీజును 8 లక్షలకు పెంచింది.