ప్రకృతి వ్యవసాయాన్ని నీరుగారుస్తున్న వైఎస్సార్సీపీ - 14 నెలలుగా కేడర్లకు వేతనాలు బంద్ (ETV Bharat) YSRCP Government Neglect Natural Farming :ప్రకృతి వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులంతా జపిస్తున్న మంత్రం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధిక దిగుబడుల కోసం వాడే రసాయనిక ఎరువులు, జీవ క్రిమిసంహారకాల వల్ల నేలతో పాటు పంట దిగుబడులు కూడా విషతుల్యంగా మారుతున్నాయి. పైగా ఎరువులు, క్రిమిసంహారకాలు, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో తక్కువ పెట్టుబడి ఉన్న ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించేలా దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయంపై శీతకన్ను వేయడంతో గుంటూరు జిల్లాలో సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల్లో సందిగ్ధత నెలకొంది.
గుంటూరు జిల్లా మిరప, ప్రత్తి, పొగాకు లాంటి వాణిజ్య పంటలకు ప్రసిద్ధి. ఈ పంటల సాగులో అధిక దిగుబడులు సొంతం చేసుకునేందుకు రైతులు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు ఎక్కువ మోతాదులో వినియోగించేవారు. అయితే ఇదంతా గతం. చాలా మంది రైతులు స్వలాభం పక్కన పెట్టి నేలకు, పర్యావరణానికి మేలు చేసే ప్రకృతి వ్యవసాయంపై మెుగ్గు చూపారు. తాము సేంద్రియ సాగు చేయడమే కాకుండా తమ పరిసర గ్రామాల రైతులకు సైతం ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేస్తున్నారు.
ముందస్తు వర్షాలతో అన్నదాత ఆనందం - సాగులో సింహభాగం వేరుశనగదే - GROUDNUT FARMERS HAPPY
రైతులను ప్రకృతి విధానంలోకి తీసుకొచ్చేందుకు వ్యవసాయ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. వీరిని ప్రకృతి వ్యవసాయ విభాగపు క్యాడర్‌లుగా పిలుస్తుంటారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ 2-3 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఆ విభాగంలో క్యాడర్‌లుగా చేరొచ్చు. రైతులకు ప్రకృతి విధానంలో వ్యవసాయం చేసేందుకు అవగాహన కల్పించి రసాయనాలు లేని పంటను పండించేలా చేయడమే వీరి విధులు. గతంలో వీరికి ప్రభుత్వం గౌరవ వేతనంగా ఐదు వేలు ఇచ్చేవారు. ఆ తరువాత 6 వేలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 7,500 రూపాయలకు వేతనం అయితే పెంచింది కానీ ఏడాది నుంచి జీతాలు విడుదల చేయడం లేదు. దీంతో క్యాడర్‌లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఏ అన్నదాతను కదిలించినా లక్షల్లో అప్పులు - రోజుకో రైతు బలవన్మరణం - Farmers Suicides In AP
గత టీడీపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించింది. క్యాడర్‌లు ప్రతి నెలా క్షేత్ర స్థాయిలో రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం చేసేలా చర్యలు తీసుకుంది. గుంటూరు జిల్లాలో దాదాపుగా 170-200 మంది వరకు క్యాడర్‌లు ఉన్నారు. వారు నివసించే గ్రామం, పక్క గ్రామాల్లో, వేరే మండలాల్లో పని చేస్తుంటారు. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృత పర్చేలా వీరు చేస్తున్న కార్యక్రమాలకు ప్రభుత్వం గౌరవ వేతనాన్ని సకాలంలో ఇవ్వాల్సింది పోయి నెలలుగా ఇవ్వకుండా అవస్థలకు గురి చేస్తోంది. క్యాడర్‌గా పనిచేస్తున్న రైతులు సొంత ఖర్చులతో వివిధ గ్రామాలు తిరుగుతూ సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తుంటే ప్రభుత్వం కనీస గౌరవ వేతనం 14 నెలలుగా చెల్లించకపోవడం దారుణమని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.
వైసీపీ హయాంలో చిక్కుల్లో సూక్ష్మసేద్యం - రెండు నుంచి ఐదో స్థానానికి దిగజార్చిన వైనం
ప్రకృతి వ్యవసాయం చేస్తూనే మట్టి మీద ఉన్న మమకారంతో, ఆ నేలను కాపాడుకోవడం బాధ్యతగా భావించి ఇతర రైతులకు సైతం ఈ సేంద్రియ వ్యవసాయంపై క్యాడర్లు ఆసక్తి కలిగించేందుకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం కుటుంబ ఖర్చులకైనా ఉపయోగపడుతుందని భావించిన ప్రకృతి రైతులకు, 14 నెలలుగా గౌరవ వేతనాన్ని చెల్లించకపోవడంతో ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నారు. గుంటూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ క్యాడర్ కు గౌరవ వేతనం అందక పోవడంతో ఇంటి కరెంటు బిల్లు కట్టలేని దుస్థితి. వైఎస్సార్సీపీ సర్కారు అధికారం చేపట్టాక ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయని క్యాడర్లు వాపోతున్నారు. ఏడాది కాలంగా జీతాలు రాకపోగా, విధి నిర్వహణకు సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి రావడంతో కుటుంబం గడవడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
3 అంగుళాల పొడవైన అరుదైన ద్రాక్ష-దేశవిదేశాల్లో ఫుల్ డిమాండ్- రైతుకు రూ.లక్షల్లో ఆదాయం
ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి వెంటనే ప్రకృతి వ్యవసాయ విభాగపు క్యాడర్లకు చెల్లించాల్సిన బకాయి వేతనాలను వెంటనే మంజూరు చేయాలని ప్రకృతి రైతులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం వైపు అన్నదాతలు అడుగులు వేసేలా మరిన్ని ప్రోత్సాహలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రధాని మోదీ నోట ప్రకాశం జిల్లా మహిళా రైతు పేరు - కరువునేలపై సిరులు పండిస్తున్న కొమ్మలపాటి వెంకటరమణమ్మ