వైఎస్సార్సీపీ నిర్లక్ష్యంతో గాల్లో దీపంలా మారిన సాగునీటి ప్రాజెక్టులు - తట్టమట్టి కూడా తీయించిందేలే! (ETV Bharat) YSRCP Government Neglect in Irrigation Projects: వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వాకంతో సాగునీటి ప్రాజెక్టుల దుస్థితి అధ్వానంగా మారింది. ప్రాజెక్టుల నిర్వహణను గాలికివదిలేయడమే కాదు కాలువల్లో తట్టమట్టి తీసిన పాపానపోలేదు. ఆ ఫలితమే వర్షాలు, వరదతో పెద్దవాగు ప్రాజెక్టు గట్టు తెగి విధ్వంసం సృష్టించింది. ఎర్రకాలువ కన్నెర్ర చేసి ఊళ్లకు ఊళ్లనే ముంచేసింది. తమ్మిలేరు, జల్లేరు ప్రాజెక్టుల నుంచి ప్రమాదం పొంచి ఉంది.
గత ఐదు సంవత్సరాల్లో సాగునీటి ప్రాజెక్టులు వైఎస్సార్సీపీ సర్కార్ నిర్లక్ష్యానికి గురయ్యాయి. కాలువల్లో మట్టి తీసేందుకూ నిధులు విడుదల చేయలేదు. అధికారుల ప్రతిపాదనలను పట్టించుకోలేదు. పెద్దవాగు ప్రాజెక్టు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాజెక్టు నిర్వహణ రెండు రాష్ట్రాలపై ఉంది. ఈ ప్రాజెక్టుపై కింద తెలంగాణలో 2వేల ఎకరాలు ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 14 వేల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది.
జగన్ హయాంలో జలయజ్ఞం వైఫల్యం - ఆ ప్రాజెక్టులే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం - EX CM jagan on irrigation projects
ప్రాజెక్టు నిర్వహణకు ఆంధ్రా 85 శాతం, తెలంగాణ 15 శాతం నిధులు ఇవ్వాలి. 87కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తమ వాటా నిధులు ఇచ్చేందుకు తెలంగాణ ముందుకు వచ్చినా వైఎస్సార్సీపీ సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా గేట్ల నిర్వహణ లేకపోవడం, గట్లు బలహీనంగా ఉండటం, తూములు శిథిలావస్థకు చేరుకోవడానికి తోడు అధికారుల నిర్లక్ష్యం అన్నీ కలిపి తాజాగా పెద్ద వాగుకు భారీ గండ్లు పడ్డాయి. వేలాది ఎకరాల్లో పంటలు కొట్టుకుపోగా పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి.
జంగారెడ్డిగూడెం పరిధిలోని ఎర్రకాలువ ప్రాజెక్టు నిర్వహణకు గత ఐదు సంవత్సరాలలో 15 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పెట్టినా పైసా విడుదల చేయలేదు. 4 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నా గట్లు బలహీనమై, ఎత్తు చేయక 3 టీఎంసీల నీరు వస్తే చాలు గేట్లు ఎత్తి కిందికి వదిలేస్తున్నారు. గతంలో గట్ల వెంబటి తవ్వకాలు జరపడంతో అవి బలహీనపడి ప్రస్తుతం తాడేపల్లిగూడెం మండలం పరిధిలోని పలు ప్రాంతాలను ఎర్రకాలువ వరద ముంచెత్తింది. కొన్ని వేల ఎకరాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి.
రెండు నెలల్లో సోమశిల ఆప్రాన్ పనులు ప్రారంభిస్తాం: నిమ్మల - Somashila Reservoir Works
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు నిర్వహణకు 28 లక్షల రూపాయలు ప్రతిపాదనలు ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీని నీటి నిల్వ సామర్థ్యం 217 మీటర్లు కాగా ప్రస్తుతం 212 మీటర్లు ఉంది. ఈ ప్రాజెక్టు గట్లు పలు చోట్ల బలహీనంగా మారాయి. వరద పెరిగితే చాలా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. చింతలపూడి పరిధిలోని తమ్మిలేరు ప్రాజెక్టు మెట్లు, చాలా చోట్ల కల్వర్టులు దెబ్బతినగా గైడ్ బండ్ దాదాపు 6 కిలోమీటర్ల మేర మరమ్మతులకు గురైంది.
నిర్వహణకు 15 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల చేయలేదు. ఈ ప్రాజెక్టుకు వరద పెరిగితే ఆ ప్రభావం ఏలూరుపై పడనుంది. ఈ ప్రాజెక్టుల నిర్వహణకు గత ఐదు సంవత్సరాలలో రూ. 117 కోట్లు ప్రతిపాదనలు పంపినా వైఎస్సార్సీపీ సర్కారు పైసా విదల్చలేదు. దీంతో ప్రాజెక్టుల పరిస్థితి గాల్లో దీపంలా మారింది. సామర్థ్యం మేర నీరు రాకున్నా గట్లు, గేట్లు సవ్యంగా లేకపోవడంతో ముందే నీటిని వదిలేస్తుండటంతో వరద ప్రభావం ఎక్కువై ఇళ్లు, ఊళ్లూ తుడిచి పెట్టుకుపోతున్నాయి.
సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బీవీ రాఘవులు - BV RAGHAVULU ON IRRIGATION PROJECTS